Monday, December 23, 2024

వంద పడకల గుండె చికిత్స కేంద్రం రావడం సంతోషకరం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: దక్షిణ భారతదేశ ప్రజలకు ఉచిత గుండె శస్త్ర చికిత్స కోసం వంద పడకల గుండె చికిత్స కేంద్రం కొండపాకలో ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స- పరిశోధన కేంద్రాన్ని శ్రీ సద్గురు మధుసూదన్ సత్యసాయితో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు.

రూ.50 కోట్ల వ్యయంతో ఎందరో దాతల సహకారంతో వైద్యాలయం ఏర్పాటు చేసిన సద్గురు మధుసూదన్ ఆశీస్సులు ఉన్నాయని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని, మానవ సేవయే మాధవ సేవగా.. మధుసూదన్ సాయి చేతుల మీదుగా విద్యాలయాలు, వైద్యాలయాలు ఏర్పాటు చేస్తూ అందరికీ మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. శ్రీ సద్గురు మధుసూదన్ సత్యసాయి సేవలను మనం స్మరించుకోవాలన్నారు. ప్రతీ 100 మందిలో ఒక చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో మృత్యువాత పడుతున్నారని, సద్గురు మధుసూదన్ సాయి ప్రార్థించగానే ఈ ప్రాంతంలో బాలల గుండె శస్త్ర చికిత్స కేంద్ర ఆసుపత్రి నెలకొల్పడం ఆనందించదగిన విషయమని చెప్పారు. సింబల్ ఆఫ్ చారిటీగా కొండపాక విద్యా, వైద్యాలయంగా నిలుస్తున్నదని,  కొండపాకకు విద్యాలయం, వైద్యాలయం, ఆనంద నిలయం వచ్చేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారికి హరీష్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సద్గురు మధుసూదన్ సాయి వైద్యాలయం కావాలని మంత్రి హరీశ్ రావు కోరారని, ఆ మేరకు నేడు వైద్యాలయం ఏర్పాటు చేశామని శ్రీ సద్గురు మధుసూదన్ సత్యసాయి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు ఈ వైద్యాలయం ద్వారా కావాల్సిన వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. 23 నవంబర్ రోజున సత్యసాయిబాబా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వైద్యాలయం గురువారం ప్రారంభం చేసుకుంటున్నామన్నారు. ఈ వైద్యాలయం త్వరగా పూర్తయ్యేలా కృషి చేసిన మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మనుషుల్లో ఉండే భగవంతుని గుర్తించడమే నిజమైన మాధవ సేవగా సద్గురు మధుసూదన్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News