50 ద్విచక్రవాహనాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నారు. ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు వికలాంగులకు అండగా నిలువబోతున్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో వంద మంది వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు కెటిఆర్ ట్వీట్ చేశారు. గతేడాది తన బర్త్‌డే సందర్భంగా కెటిఆర్ తన సొంత ఖర్చులతో 6 అంబులెన్స్‌లను అందించారు. కెటిఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు కలిసి 90 అంబులెన్స్‌లను అందజేశారని ట్వీట్ లో పేర్కొన్నారు.
ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనండి
తన బర్త్‌డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని కెటిఆర్ పిలుపునిచ్చారు. లేదా గిప్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సొంతంగా ఎవరికైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌లపై ఖర్చు పెట్టొద్దని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు.
కెటిఆర్ ట్వీట్ కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. మంత్రి కెటిఆర్ తీసుకున్న నిర్ణయం ఆపదలో ఉన్న ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని, తమకు ప్రేరణగా నిలిచే నాయకుడి అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉందని రీ ట్వీట్ చేశారు. కెటిఆర్ బర్త్‌డే సందర్భంగా తాను కూడా 50 బైక్‌లను విరాళంగా ఇస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ట్విట్టర్ లో పేర్కొన్నారు.