Monday, January 20, 2025

వంద రోజులు దాటిన యుద్ధం

- Advertisement -
- Advertisement -

Special article about quad summit in tokyo

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించి మొన్న మూడో తేదీతో వంద రోజులు దాటిపోయింది. ఉక్రెయిన్‌ను తన దారికి రప్పించడం తప్ప దానిని ఆక్రమించుకోడం తన ఉద్దేశం కాదని మొదట్లో ప్రకటించిన రష్యా యిప్పుడు తాను స్వాధీనం చేసుకొన్న ప్రాంతాలను సొంతం చేసుకోడం ప్రారంభించింది. తన కరెన్సీ రూబుల్‌ను అక్కడ అమల్లోకి తెస్తున్నది. అక్కడి పౌరులకు తన పాసు పోర్టులు జారీ చేస్తున్నది. ఉత్తర ఉక్రెయిన్ డోన్‌బాస్ ప్రాంతంలోని వేర్పాటువాద భాగాలు రష్యాలో కలిసిపోయామన్న అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఉక్రెయిన్ దక్షిణ భాగంలోని ఖేర్సన్, హృవ్నియా ప్రాంతాల్లోనూ యిదే పరిస్థితి. మొత్తం డోన్‌బాస్‌ను ఆక్రమించుకోడానికి రష్యా ముందుకు పోతున్నది. ఉక్రెయిన్‌లో కొన్ని భాగాలను విముక్తం చేశామని, తమ లక్ష్యం పూర్తి అయ్యే వరకు విశ్రమించేది లేదని రష్యా ప్రతినిధి డెమిత్రి పెస్కోవ్ చెప్పారు. యుద్ధం మొదలై వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వొక వీడీయో విడుదల చేశారు. అతి పెద్ద శత్రువును వంద రోజుల పాటు ఎదుర్కొన్నామని, రష్యాకు సులభంగా లొంగిపోయేది లేదని ఆయన అందులో పేర్కొన్నారు. ఈ సంవత్సరాంతానికి రష్యా నుంచి తొంభై శాతం ఆయిల్, గ్యాస్ దిగుమతులను మానుకోవాలని యూరపు దేశాల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే అమెరికా ఆ పని చేస్తున్నది. అయితే రష్యా పై ఆంక్షలు దానికి ఎటువంటి హాని కలగజేయడం లేదని, దానిలో యే మాత్రం భయం పుట్టించడం లేదని రుజువు అవుతున్నది. ఆంక్షలు తమపై ఎటువంటి వ్యతిరేక ప్రభావం చూపకపోగా, తమ ఆయిల్ ఎగుమతుల నుంచి లాభాలు భారీగా పెరుగుతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లవ్రోవ్ అన్నారు. క్రూడాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్నది. బ్యారెల్ 120 డాలర్లు దాటిపోయింది. ఇది రష్యాకి లాభించే అంశం. ఉక్రెయిన్ పౌరులను యుద్ధం తీవ్రంగా నష్టపరిచింది. దాదాపు కోటిన్నర లక్షల మంది నిర్వాసితులయ్యారు. వారు పడుతున్న బాధలు చెప్పనలవికానివి. అమెరికా 70 కోట్ల డాలర్ల కొత్త సైనిక సహాయ పథకం కింద ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు పంపిస్తున్నది. యుద్ధం పరోక్షంగా రష్యా అమెరికా, -నాటోల మధ్యనే సాగుతున్నది. ఇంకోవైపు యుద్ధం ఆహార, ఇంధన సంక్షోభాన్ని దాపురింపజేస్తున్నది. ఉక్రెయిన్‌లోని ఐదో వంతు భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయినట్టు వార్తలు చెబుతున్నాయి. ఆఫ్రికా దేశాలు తాము వినియోగించే గోధుమలో సగానికి పైగా ఉక్రెయిన్, రష్యాల నుంచే దిగుమతి చేసుకొంటాయి. ఇప్పుడవి తీవ్ర ఆహార సంక్షోభంలో పడిపోయాయి. ఈ దేశాలకు గోధుమలను తీసుకుపోయే నల్లసముద్ర రేవులు రష్యా సేనల ఆధీనంలో ఉన్నాయి. ఆ రేవుల్లో చిక్కుబడిపోయిన ఆహారం, ఎరువుల నిల్వలపై నూట ఏభై కోట్ల మంది ఆధారపడి ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వాటిని విడుదల చేయించడానికి కృషి చేస్తున్నట్టు సమితి ప్రకటించింది. యుద్ధం అహంకారాన్ని మాత్రమే సంతృప్తి పరచగలదు. అంతకు మించి మేలు చేయదు. ఉక్రెయిన్ పై రష్యా దాడితో మొదలైన ఈ యుద్ధం ప్రపంచాన్ని తిరిగి రెండు కూటాలుగా విభజించి ప్రత్యక్ష యుద్ధ శకానికి నాంది పలకవచ్చు. ప్రస్తుతానికి యుద్ధం కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాజీ యత్నాలూ కనుచూపు మేరలో లేవు. ఈ యుద్ధం ఇంత కాలంగా సాగుతున్నప్పటికీ అమెరికా, దాని మిత్రదేశాలు ప్రత్యక్షంగా రంగ ప్రవేశం చేయకపోడం ఒక మంచి పరిణామం. అవి ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించడం కొనసాగే వరకు యుద్ధం ఇలాగే రాజుతూ వుంటుంది. తన భూభాగాలు ఒకటొకటిగా రష్యా ఆధీనంలోకి పోతున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తలవొగ్గేటట్టు లేడు. ఎందుకంటే ఆయనను వెనుక నుంచి యుద్ధభూమిలో నడిపిస్తున్న అమెరికా, యూరపు, నాటో దళాలు ఆయన చేత రష్యాను ఎలాగైనా ఓడించాలని చూస్తున్నాయి. వాటికి ఉక్రెయిన్, ప్రపంచ ప్రజల బాధలతో నిమిత్తం లేదు. యుద్ధం వల్ల ఇప్పటికే పేద దేశాల్లో ధరలు మిన్నంటాయి. మానవత్వం ఉన్నవారు యెవరైనా ప్రపంచ ప్రజల బాధలు తొలగడానికి, యుద్ధం తక్షణం ఆగిపోడానికే తోడ్పడతారు. పుతిన్‌ను మానసిక క్షోభకుగురి చేయొద్దని ఫ్రాన్స్ హెచ్చరించిం ది. కాని ఆ సూచనను జెలెన్ స్కీ తిరస్కరించాడు. ఆయనను ఫలవంతమైన చర్చల వైపు నడిపించే బాధ్యత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పైనే ఉంది. ప్రపంచ శాంతిని కాపాడుతా మని చెప్పుకున్న అగ్ర రాజ్య అధినేతలు ఇప్పటికైనా తమ ధోరణిని మార్చుకోవలసి వుంది. వారు ఈ యుద్ధ జ్వాలలతో స్వప్రయోజనాల చలికాచుకోడం ఆపకపోతే అసలైన యుద్ధ నేరస్థులుగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతారు. నాటో కూటమిని కొనసాగిస్తూ పోడంలోని అపరాధాన్ని అమెరికా ఇప్పటికైనా గమనించాలి.

100 days of Russia’s War on Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News