తూర్పు ఉక్రెయిన్ రష్యా కైవసం
మృతులు 10,000 మంది
శరణార్థులు 68 లక్షల మంది
మందకొడి దాడితో విధ్వంసకాండ
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేపట్టి 100 రోజుల దశకు చేరుకుంది. శుక్రవారం రష్యా సైనికబలగాలు అత్యంత కీలకమైన డాన్‌బస్‌పై తమ పట్టు మరింత బిగించాయి. తూర్పు ప్రాంతంలో రష్యా దాడుల తీవ్రతతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తమ దిక్కుతోచని నిస్సహాయ స్థితిని చెప్పకనే చెపుతూ ఉక్రెయిన్ అధికారవర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. తమ భూభాగం 20 శాతం వరకూ ఇప్పుడు రష్యా కైవసం చేసుకుందని తెలిపాయి. క్రైమియా, డాన్‌బస్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమైంది. రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే క్రమాన్ని పక్కకు పెట్టి రష్యాబలగాలు గత రెండు నెలలుగా తూర్పు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే పనిలో పడ్డాయి. రష్యా వ్యూహాత్మకంగానే యుద్ధాన్ని పొడిగింపచేస్తూ ఉక్రెయిన్‌ను దెబ్బతీయాలని భావిస్తున్నట్లు వెల్లడైంది.
తప్పనిసరిగా తాము దీర్ఘకాలిక పోరు, ప్రభావానికి మరింతగా సిద్ధం కావల్సి ఉంటుందని , ఇంతకు మించి గత్యంతరం లేదని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బెర్గ్ తెలిపారు. అంతకుముందు నాటో అధినేత వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ జో బైడెన్‌తో చర్చించారు. రష్యా ఎటూ తేల్చని పోరుకు సిద్ధం అయినట్లు ఉందని, అయితే దీనిని తట్టుకోవడం అన్ని పక్షాలకు సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు నాటో దేశాలను వెంటాడుతోంది. భూభాగాల ఆక్రమణల సంగతి ఇప్పటికీ నిర్థారణ కాకపోయినా ఈ 90 రోజులలో ఉక్రెయిన్‌లో 10,000 మంది వరకూ దుర్మరణం చెందారు. 68లక్షల మంది మంది దూర ప్రాంతాలకు తరలివెళ్లి శరణార్థులు అయ్యారు. 5ం వేలకు పైగా భవనాలు ధ్వంసం అయ్యాయి. ఇక యుద్ధదశలో బాంబుల వర్షాలకు రోజూ వంద మంది వరకూ ఉక్రెయిన్ సైనికులు బలి అవుతున్నారు.