న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనల తరువాత 100మంది రైతుల జాడ తెలియడం లేదు. పంజాబ్‌కు చెందిన ఈ రైతులు ఏమయ్యారనేది ఇప్పుడు ఆందోళనకరం అయింది. వీరి ఆచూకి కనుగొనాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. నాలుగయిదురోజులు దాటినా రైతులు ఇంటికి చేరకపోవడంతో వారి పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరం అయింది. రైతులు గల్లంతు అయిన విషయాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ పంజాబ్ మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనడానికి వచ్చిన పంజాబ్ రైతులు కన్పించకుండా పోయినట్లు ఈ హక్కుల సంస్థ తెలియచేయడంతో పంజాబ్‌లో రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మోగా దగ్గరిలోని తతారివాలా గ్రామస్తులు డజన్ మంది కూడా ఈ వంద మందిలో ఉన్నారు. రైతుల గల్లంతుపై భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవల్) నేత బల్బీర్ సింగ్ స్పందించారు. అదృశ్యం అయినట్లు చెపుతున్న వారి పేర్లను సేకరించడం జరుగుతుందని, వారి ఆచూకికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు.
100 Farmers Missing since R-Day Protest