101మంది ఎంఎల్ఎల ప్రమాణ స్వీకారం
ఈనెల 14వ తేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా
అదేరోజు స్పీకర్ ఎన్నిక
మాజీ సిఎం కెసిఆర్, కెటిఆర్‌లతో సహా మరో 16 మంది అసెంబ్లీకి గైర్హాజరు
మొదటగా రేవంత్, అనంతరం భట్టి, మంత్రుల ప్రమాణ స్వీకారం
అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది నూతన ఎమ్మెల్యేలు
ఎంపి పదవులకు రాజీనామా చేయకపోవడంతో ప్రమాణస్వీకారానికి హాజరుకాని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సభను వాయిదా వేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలతో పాటు ఒక సిపిఐ ఎమ్మెల్యే ప్రమాణం చేశారు. అనంతరం ఈ నెల 14వ తేదీకి అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలను బిజెపి ఎమ్మెల్యేలు బహిష్కరించారు. మరోవైపు కెసిఆర్ అనారోగ్యం కారణంగా కెసిఆర్, కెటిఆర్ ఇద్దరూ శనివారం జరిగిన ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేక పోయారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను 101 మంది మాత్రమే శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
ఇందులో కెసిఆర్, కెటిఆర్‌లు పోనూ మరో 16 మంది ఈ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని మాజీ మంత్రి కెటిఆర్ కోరారు. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా 51 మంది కొత్త ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా రేవంత్, అనంతరం భట్టి, మంత్రులు
ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సిఎం రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకారం చేయని వారిలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో నల్గొండ, భువనగిరి ఎంపిలుగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఇంకా ఎంపి పదవికి రాజీనామాలు చేయకపోవడంపై నేడు ఎమ్మెల్యేలుగా వారు ప్రమాణస్వీకారం చేయలేదు. ఆ తరువాత మిగతా సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు.
14వ తేదీన స్పీకర్ ఎన్నిక
సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభను ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. అదేరోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్‌గా ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. మరోవైపు ఇటీవల ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి రాజీనామాలను ఆమోదించారు.
ప్రమాణస్వీకారం చేయని వారిలో…
ప్రమాణస్వీకారం చేయని వారిలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్, టి.పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు 8 మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎమ్మెల్సీకి రాజీనామా…
పాడి కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి శనివారం ఉదయం 11 గంటలకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.