న్యూఢిల్లీ : కేంద్రం ఆదేశాలతో సామాజిక మాధ్యమాల నుంచి దాదాపు 100 ట్వీట్లను తొలిగించివేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ ఇతరత్రా సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న స్పందనలు వాటిలోని అంశాలపై కేంద్ర ప్రసారాల, ఐటి మంత్రిత్వశాఖ నిఘా తీవ్రతరం చేసింది. ఏ విషయం గురించి అయినా దురుద్ధేశపూర్వక వ్యాఖ్యానాలు వెలువరించే వారికి సోషల్ మీడియాలు వేదిక కాకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో వెలువడ్డ దాదాపు 100 అంతకు మించిన ట్వీట్లు, పోస్ట్లపై కేంద్రం తీవ్రస్థాయిలో చట్టపరమైన చర్యలకు హెచ్చరికలు వెలువరించింది. దీనికి అనుగుణంగా ఈ ట్వీట్లు, సంబంధిత యుఆర్ఎల్స్ను ట్విట్టర్, ఫేస్బుక్ ఇతరత్రా మాధ్యమాలనుంచి తొలిగించారు. తాము తీసుకున్న చర్యలను సంబంధిత అకౌంట్హోల్డర్లకు తెలియచేసినట్లు ట్విట్టర్ తెలిపింది.
భారత ప్రభుత్వం నుంచి తమకు అందిన చట్టపరమైన రిక్వెస్టులకు అనుగుణంగా వీటిని తొలిగించివేసినట్లు వెల్లడించారు. అయితే ఈ అంశంపై ఫేస్బుక్ స్పందించలేదు. కరోనాపై పోరు సల్పుతున్న దశలో దీనిని ఏదో విధంగా దెబ్బతీసే ఎటువంటి వ్యాఖ్యలు అయినా అనుచితం అని , ప్రజా జీవన క్రమానికి విఘాతం కల్పించే వాటిని అనుమతించడం సహించరాని విషయమే అవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల నుంచి సోషల్ మీడియాకు తాఖీదులు వెళ్లాయి. దేశంలో కరోనా రోగులకు చికిత్సల దిశలో ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ల సంబంధిత సమాచారపై గందరగోళానికి దారితీసే ట్వీట్లపై హోం మంత్రిత్వశాఖ సూచనల మేరకు ఐటి మంత్రిత్వశాఖ క్షేత్రస్థాయిలో స్పందిస్తోంది. సోషల్ మీడియాను వాడుకుని కీలక అంశాలపై దుష్ప్రచారానికి దిగడం, ప్రజల దృష్టిని మళ్లించడం వంటివాటిపై కేంద్రం హెచ్చరికలతో ట్వీట్లకు బ్రేక్ పడింది.