వారిలో 100 మందికి కరోనా పరీక్షలు : బిఎంసి
ముంబై : ఒమిక్రాన్ వైరస్ మొట్టమొదట బయటపడిన ఆఫ్రికా దేశాల నుంచి గత 15 రోజుల కాలంలో కనీసం వెయ్యి మంది ప్రయాణికులు ముంబైకు వచ్చారని, వీరిలో ఇంతవరకు లభించిన 466 మంది జాబితాలో కనీసం 100 మంది నమూనాలను సేకరించడమైందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) అడిషనల్ మున్సినల్ కమిషనర్ సురేష్ కాకాని ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. ఆ రిపోర్టులు త్వరలో వస్తాయని నెగెటివ్ రిపోర్టు అయితే ఎలాంటి సమస్య ఉండదని, పాజిటివ్ శాంపిల్స్ అయితే జీనోమ్ సీక్వెన్సింగ్, ఎస్‌జీన్ మిస్సింగ్ టెస్టు మున్పిపల్ కార్పొరేషన్ చేయిస్తుందని చెప్పారు. ఎస్‌జీన్ మిస్సింగ్ కేసు అయితే ఆ ప్రయాణికుడు ఒమిక్రాన్ భాధితుడు కావచ్చని అంచనా వేయవచ్చని, జీనోమ్ సీక్వెన్సింగ్ వల్లనే వైరస్ నిర్ధారణ అవుతుందని తెలిపారు. వైరస్ బారిన పడిన ప్రయాణికులు సింప్టొమేటిక్, లేదా అసింప్టొమేటిక్ అయినా మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన సబర్బన్ అంధేరీ లోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో క్వారంటైన్‌కు పంపడమౌతుందని చెప్పారు. ఒమిక్రాన్ వైరస్ భయం పెరగడంతో బిఎంసి తన ఐదు ఆస్పత్రుల్లో విస్తృతమైన వైద్య చికిత్స ఏర్పాట్లు చేసింది.