కొలంబో : శ్రీలంక అధ్యక్ష , ప్రధాని నివాస భవనాలను ఆందోళన కారులు ఆక్రమించుకున్న తరువాత ఆ భవనాల్లోని వెయ్యికి మించి కళాఖండాలు అదశ్యమయ్యాయని పోలీస్ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ నెల 9న ఆందోళనకారులు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అప్పటి మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘె నివాస భవనాలను ఆక్రమించుకున్నారు. ఒక భవనానికి నిప్పు పెట్టారు కూడా. అరుదైన కళాఖండాలతోపాటు అత్యంత విలువైన కళాఖండాలు గల్లంతయ్యాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్‌లు చెబుతున్నట్టు వెబ్ పోర్టల్ కొలంబో పేజీ ఉదహరించింది. దీనిపై దర్యాప్తు మరింత పకడ్బందీగా సాగించడానికి వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. అయితే అధికారులకు ఆందోళన కలిగించే విషయం ఏమంటే శ్రీలంక పురావస్తు విభాగం దగ్గర ఈ కళాఖండాల గురించి సవివరమైన రికార్డు లేకపోవడం. కచ్చితంగా ఎన్ని కళాఖండాలు అదృశ్యమయ్యాయో చెప్పడం కష్టమని పురావస్తుశాఖ సీనియర్ అధికారి చెబుతున్నా దాదాపు వెయ్యి కళాఖండాలు అదృశ్యమయ్యాయని అంచనా వేస్తున్నారు.