Monday, December 23, 2024

తొమ్మిదేళ్లలో జగిత్యాల అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో జగిత్యాల అభివృద్ధికి రూ.1000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాలలో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సిఎం కెసిఆర్‌కు రెండు కళ్లులాంటివన్నారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం ప్రజల అంచనలకు మించి నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. జగిత్యాల పట్టణానికి గతంలో రూ.5 కోట్లు తెస్తేనే గొప్పగ గోడలపై రాసుకున్న చరిత్ర చూశామని, అదే నేడు వెయ్యి కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి జగిత్యాల పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణానికి ప్రతి నెల రూ.మూడు కోట్ల చొప్పున ఈ తొమ్మిదేళ్లలో 350 కోట్ల సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 10,800 మంది ఆడ బిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా 97 కోట్లు మంజూరు చేశామన్నారు.

గత పాలకు లు జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్‌ను సరిగా రూపొందించక పట్టణాన్ని అస్తవ్యస్తం చేశారని, తద్వారా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారన్నారు. పట్టణంలో 14 జోన్‌లలో 120 సర్వే నంబర్లను మార్చి ప్రజల సమస్యలన్నింటినీ తీర్చామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల పట్టణంలో ఇళ్లులేని నిరుపేదల కోసం 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడం జరిగిందని, త్వరలోనే లభ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. రూ.5 కోట్లతో డబుల్ బెడ్ రూం కాలనీలో సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. రూ.200 కోట్లతో మెడికల్ కాలేజి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే కళాశాల ప్రారంభమై 150 మంది వైద్య విద్యార్థులకు విద్యాబోధన జరుగుతోందన్నారు.

కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు కావడంతో ఈ ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గత 60 యేళ్లలో జగిత్యాల పట్టణంలో 6500 కరెంటు స్థంభాలు ఉంటే ఈ తొమ్మిదేళ్లలో కొత్తగా 3 వేల కరెంటు స్థంభాలు వేసి నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. పారిశుధ్ద కార్మికులకు 2014లో 6 వేల వేతనం ఉంటే దాన్ని రూ.16 వేలకు పెంచి సపాయన్న కళ్లలో ఆనందం నింపారన్నారు.

జగిత్యాల పట్టణంలో చెత్త సేకరణ కోసం గతంలో 27 వాహనాలు ఉంటే కొత్తగా మరో 72 వాహనాలు కొనుగోలు చేసి పట్టణంలోని వీధులను సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గతంలో నిర్మించిన టౌన్ హాల్ దశాబ్ద కాలంపాటు నిరుపయోగంగా ఉండేదని, దాన్ని ఆధునీకరించి తాము వినియోగంలోకి తీసుకురావడంతో నెలకు లక్ష కు పైగా మున్సిపల్‌కు ఆదాయం వస్తోందన్నారు. దశాబ్ది ఉత్సవాలను చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకులు ఏం సాధించారని ఉత్సవాలు చేస్తూన్నారంటూ ప్రశ్నిస్తున్నారని, 2014 నుంచి ఇప్పటి వరకు రూ.1000 కోట్ల నిధులు ఖర్చు చేసి పట్టణాన్ని అభివృద్ధి చేసినందుకే ఉత్సవాలు నిర్వహిస్తున్నామంటూ ఎంఎల్‌ఎ సమాధానం ఇచ్చారు.

కరీంనగర్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి రమణ మాట్లాడుతూ గతం లో జగిత్యాల పట్టణానికి వేసవి కాలంలో మంచినీటి ఇబ్బందులు తలెత్తేవని, ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువకు అడ్డుగా ఇసుక బస్తాలు వేసి పోలీ సు పహారా మధ్య నీటిని ధర్మసముద్రంకు చేర్చాల్సి వచ్చేదని, అదే నేడు మిషన్ భగీరథతో ప్రతి రోజు ఇంటింటికి మంచినీరందించడం గొప్ప విషయం అన్నారు. జగిత్యాల జిల్లాగా మారడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు.

రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయకుండా కోట్లాది రూపాయలు అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందన్నారు. యావర్‌రోడ్డు విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రజలు సహకరించాలని రమణ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డాక్టర్ నరేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News