కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు
తాడ్కోల్ శివారులో 28 ఎకరాల్లో వెయ్యి ఇండ్లను మంజూరు చేశాం
బాన్సువాడను బంజారాహిల్స్‌గా ఆధునీకరించేందుకు పనిచేస్తున్నాం
ప్రజల కోసం పోటీ పడి పనిచేయాలి తప్ప చెడు ఆలోచనలు చేయకూడదు
కాలనీలు, వాడల్లో మౌళిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
మన తెలంగాణ/బాన్సువాడ: కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు కట్టించి ఇవ్వడమే లక్ష్యమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని దాసరి గల్లీలో నూతనంగా నిర్మించిన 28 రెండు పడక గదుల ఇండ్లను ప్రారంభించి, లబ్దిదారులచే గృహ ప్రవేశం చేయించారు. అలాగే చైతన్య కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న రెడ్డి సంఘం భవనానికి ప్రహరీ గోడ, షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్ జిఒఎస్ కాలనీలో రూ.30 లక్షలతో నిర్మించనున్న మనుమయ సంఘం కళ్యాణ మండపానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి పేదవారికి స్వంత ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇల్లు మనిషికి శాశ్వత ఆస్థి అని, ఇల్లు, పెళ్లి రెండు కూడా నూరేళ్ల పంట అన్నారు. పట్టణ పరిధిలోని తాడ్కోల్ శివారులో 28 ఎకరాల్లో మొత్తం 1000 ఇండ్లను మంజూరు చేశామన్నారు. మొదటి దశలో 500 ఇండ్లు నిర్మాణం పూర్తయి లబ్దిదారులు కూడా నివాసముంటున్నారన్నారు. మిగతా 500 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. స్వంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి బాన్సువాడ పట్టణంలోనే 1000 ఇండ్లను మంజూరు చేశామన్నారు. నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయన్నారు. నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 5 వేల ఇండ్లను మంజూరు చేసిందన్నారు.
బాన్సువాడ మున్సిపాలిటిగా ప్రకటించిన తర్వాత పట్టణంలో మౌళిక సదుపాయాలు మెరుగు పరచడానికి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రూ.25 కోట్లను మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో పట్టణంలో మౌళిక సదుపాయాలు మెరుగు పరిచామన్నారు. రూ.25 కోట్ల నిధులను సిఎం కెసిఆర్ ఇటీవల మంజూరు చేశారన్నారు. ఇప్పటికే చాలా కాలనీల్లో, వాడల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి పరిశుభ్రతను మెరుగు పరిచామన్నారు. బాన్సువాడ పట్టణంలో నివసిస్తున్న ప్రతి మనిషి, పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జీవించాలన్నదనే లక్ష్యంతోనే బాన్సువాడ పట్టణంలో పరిశుభ్రతను పెంచడానికి పనులు చేయిస్తున్నామని పోచారం స్పష్టం చేశారు.
ఇది చూసి కొంతమంది చెడుగా ఆలోచనలు చేస్తున్నారని, తట్టుకోలేక పోతున్నారన్నారు. ప్రజలకు సేవ చేయడానికి పోటీ పడి పనిచేయాలి తప్ప రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు. తాము పేదల కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తామని, తప్ప మరో ఆలోచన లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ మార్కెట్ కమిటి చైర్మన్ పాత బాలకృష్ణ, బుడ్మి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, నాయకులు వెంకట్రామ్ రెడ్డి, ఎజాజ్, బాబా, కిరణ్, కౌన్సిలర్లు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.