Monday, January 20, 2025

మైక్రోసాఫ్ట్‌లో 10,000 జాబ్‌లు కట్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికా ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. ఉద్యోగుల కోసం బ్లాగ్‌పోస్ట్‌లో విడుదల చేసిన కమ్యూనికేషన్‌లో న్నట్టు కంపెనీ సిఇఒ సత్య నాదెళ్ల ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఈ రోజు మేము మార్పులు చేపట్టాల్సి వస్తోంది. ఈ ఫలితంగానే మొత్తం ఉద్యోగుల్లో కొంత తగ్గింపు తప్పనిసరి అయింది. 202223 క్యూ3 ముగింపు నాటికి 10 వేల ఉద్యోగులను తొలగించనున్నాం. ఇది మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం లోపు ఉంటుంది’ అని నాదెళ్ల తన పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు కష్టమైందే, కానీ అవసరమని ఆయన అన్నారు. ఇప్పటికే ట్విట్టర్, మెటాతో పాటు అనేక ఇతర టెక్ కంపెనీలు లేఆఫ్‌లను మొదలుపెట్టాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఈ జాబితాలో చేరింది. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా మైక్రోసాఫ్ట్ ఈ వారంలో 5 శాతం ఉద్యోగులను (సుమారు 10,000 మంది) తొలగించే అవకాశముంది. ప్రధానంగా ఇంజినీరింగ్ డివిజన్‌కు చెందినవారు ఈ తొలగింపు వల్ల నష్టపోనున్నారు.

జూన్ 30 నాటికి కంపెనీలో 2,21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిలో అమెరికాకు చెందిన వారు 1,22,000 మంది, ఇతర దేశాల్లో 99,000 మంది ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ అన్ని విభాగాల్లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగుల తొలగింపుపై కొంతకాలంగా సూచనలు చేస్తూనే ఉంది. కంపెనీ సిఇఒ సత్య నాదెళ్ల సిఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ ప్రపంచ మార్పులకు అతీతం కాదని అన్నారు. రాబోయే 2 సంవత్సరాలు టెక్ కంపెనీలకు సవాలుగా ఉంటాయని నాదెళ్ల అన్నారు. గత 5 నెలలుగా అనేక అమెరికా టెక్ దిగ్గజాలు నిర్వహణ ఖర్చులను ఆదా చేసేందుకు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం, వృద్ధి మందగించడం, అధిక నియామకాలు వంటివి లేఆఫ్‌లకు ప్రధాన కారణమని కంపెనీలు పేర్కొంటున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News