లండన్ : కొవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా బ్రిటన్‌లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 90 వేల కొవిడ్ కేసులు బయటపడగా, అందులో 10 వేల కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే. బ్రిటన్ లోనే ఒమిక్రాన్ తొలి మరణం నమోదు కాగా, ఇప్పుడు ఒమిక్రాన్ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. శుక్రవారం నాడు 3201 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, శనివారం ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగి, అమాంతంగా 10,059 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24,968 కి పెరిగింది. గత 24 గంటల్లోనే 90, 418 కేసులు నమోదు కావడంతో అదుపు చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. శాస్త్రవేత్తల సమాచారం, సలహాలపై కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలకు ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ దావిద్ తెలిపారు.
మొదట్లో ఒమిక్రాన్ భయం కలిగించినప్పటికీ గత ఏడాది కొవిడ్ విజృంభణ సమయంలో ఆస్పత్రిలో చేరికలతో పోలిస్తే ప్రస్తుతం అలాంటి కేసులు తక్కువ గానే ఉన్నాయని, పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వెంటిలేటర్ అవసరమయ్యే కేసుల సంఖ్య తక్కువ గానే ఉందని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తోపాటు బ్రిటన్ వ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వేల్స్ లోనూ క్రిస్మస్ తరువాత 27 నుంచి పలు ఆంక్షలు విధించనున్నట్టు అక్కడి అదికారులు వెల్లడించారు.