Wednesday, January 22, 2025

సూర్యుడిపై లక్ష కి.మీ ఎత్తైన “ప్లాస్మాజలపాతం”

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సూర్యుడు భగభగ మండే జ్వాలాగోళమని మనందరికీ తెలిసిందే. కేవలం సూర్యగోళం పైనే కాకుండా దానికి చుట్టుపక్కల కొన్ని వేల మైళ్ల దూరం వరకు మంటలు మండుతుంటాయి. ఈ దృశ్యాలు శక్తివంతమైన టెలిస్కోపుల ద్వారా శాస్త్రవేత్తలు దర్శిస్తుంటారు. సూర్యుడు ఎన్నెన్నో వింతల గోళాకారుడు. భూమి మీద సమస్త జీవులకు ఆధారంగా వెలుగొందుతున్నాడు. తన వేడితో చైతన్యం కల్పిస్తున్నాడు. అలాంటి సూర్యబింబంలో ఇటీవల ఓ దృశ్యం అందరికీ వింత అనుభూతిని కలిగించింది. అర్జెంటీనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డో షాబెర్గర్ పౌపో … సూర్యుడి ఉపరితలం నుంచి భారీగా ప్లాస్మా ఎగిసిపడే అద్భుతమైన దృశ్యాన్ని మార్చి 9న తన ఫోటోలో బంధించ గలిగాడు. ప్లాస్మాకు చెందిన అపారమైన గోడ చాలా వేగంగా సూర్యుడి ఉపరితలంపై కూలిపోతున్నట్టు ఈ దృశ్యం కనిపిస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఫోటో తీయడానికి పౌపో ప్రత్యేకమైన కెమెరా ఉపయోగించాడు. ఈ ప్లాస్మా సూర్యుని ఉపరితలం నుంచి 62,000 మైళ్ల ( లక్ష కిలోమీటర్ల) ఎత్తువరకు ఎగిసిపడడం గమనించవచ్చునని పౌపో స్పేస్ వెథర్‌కామ్ కి తెలియజేశాడు.

ఇది దాదాపు ఎనిమిది భూగోళాలను ఒకదానిమీద ఒకటి చొప్పున పేర్చితే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తున కనిపించిందని పేర్కొన్నాడు. నా కంప్యూటర్ స్క్రీన్ మీద వందలాది ప్లాస్మా దారాలు గోడపై నుంచి కిందకు పడుతున్నట్టు కనిపించిందని పౌపో చెప్పాడు. ఇలాంటివి ఇంతకు ముందు కూడా కనిపించాయి. సూర్యుడి ధ్రువాల వద్ద ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని “పోలార్ క్రౌన్ ప్రామినెన్స్‌” (పిసిపి) అని పిలుస్తారు. ఈ విధంగా సూర్యుడి నుంచి ఎగిసిపడిన ప్లాస్మా గంటకు 22,370 కిలోమీటర్ల వేగంతో మళ్లీ వెనక్కి పడిపోయాయని స్పేస్ కామ్ వెల్లడించింది. పోలార్ క్రౌన్ ప్రామినెన్స్ (పిసిపి) అనేవి సాధారణ పోలికల సౌర ప్రాముఖ్యతలుగా లైవ్ సైన్స్ వివరించింది. ఇవి ప్లాస్మాకు చెందిన ఉచ్చులని, లేదా అయనీకరణ వాయువులు కావచ్చని పేర్కొంది. సూర్యుడి ఉపరితలం లోని అయస్కాంత క్షేత్రాల నుంచి ఇవి బయటకు వస్తాయని పేర్కొంది. ఏదేమైనా సూర్యుని అయస్కాంత క్షేత్రాల వద్ద 60 నుంచి 70 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడతాయని వివరించింది. అయితే అవి తిరిగి సూర్యుని వైపు వెనక్కు పడిపోతాయని, దీనికి కారణం ధ్రువాల వద్ద అయస్కాంత క్షేత్రాలు చాలా శక్తివంతంగా, బలంగా ఉంటాయని నాసా పేర్కొంది. ఈ విధంగా వెనక్కు పడిపోవడాన్ని “ప్లాస్మా జలపాతం”గా నాసా పేరు పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News