Monday, December 23, 2024

మొరాకో నేలమట్టం

- Advertisement -
- Advertisement -

మర్రాకేశ్(మొరాకో): ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య 1037కు చేరింది. భూకంపం ధాటికి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 1200 మంది తీవ్రంగా గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం వెల్లడించింది. పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలో మీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.8 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్‌హౌజ్ ప్రావిన్స్ లోని ఎల్‌ఘిల్ నగరంలో భూకంప కేంద్రంగా ప్రకంపనలు వ్యాపించినట్టు అధికారులు చెప్పారు. 18 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైంది.

అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు ఈ భూకంపం ధాటికి వణికిపోయాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అకస్మాత్తుగా భవనాలు ధ్వంసం కావడంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. మర్రాకేశ్‌లో 12వ శతాబ్దంలో నిర్మించిన ప్రఖ్యాత కౌటోబియా మసీదు బాగా దెబ్బతింది. 226 అడుగుల ఎత్తున ఉన్న బురుజు వంటి నిర్మాణం దెబ్బతింది. పాత నగరం చుట్టూ ఉన్న ప్రాచీన గోడలు దెబ్బతినడంతో వాటి దృశ్యాలు మొరాకో ప్రజలు పోస్ట్ చేశారు. మర్రాకేశ్ నగరం మాత్రం బారీగా ధ్వంసమైంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అల్ హౌజ్ ప్రావిన్స్‌లో రోడ్లపై శిధిలాలను అధికారులు, సిబ్బంది తొలగిస్తున్నారు. కొండప్రాంతమైన ఈ ప్రావిన్స్‌లో అనేక గ్రామాలు కొండలకు ఆనుకుని ఉన్నాయి. మిలిటరీ, ఎమర్జెన్సీ బృందాలు రంగం లోకి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారితో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలో కనిపించింది. శనివారం ఉదయం మర్రాకేశ్ నగరంలో వ్యాపారాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. టూరిస్టులు, ప్రజలు రాకపోకలు తిరిగి ప్రారంభించారు. శతాబ్ద కాలంలో ఉత్తరాఫ్రికాలో ఈ స్థాయి భూకంపాన్ని చూడలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 1960లో మొరాకోలోని అగాదిర్ నగరం సమీపంలో భూకంపం సంభవించి వేలాది మంది మరణించారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి…
మొరాకో భూకంపం పై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జి20 ప్రారంభోపన్యాసంలో మోడీ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News