ఓ హత్యకేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు అనుభవిస్తున్న శతాధిక (104 ఏళ్లు ) వృద్ధుడు 36 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవలనే సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పశ్చిమబెంగాల్ లోని మాల్డా కరెక్షనల్ జైలు నుంచి బయటకు వచ్చాడు. మాల్డా జిల్లా లోని మానిక్ చక్ ప్రాంతానికి చెందిన రసిక్ చంద్ర మోండల్ భూ వివాదంపై 1988లో ఘర్షణ పడి తన సోదరుడిని హత్య చేశాడు. ఈ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు దోషిగా తేల్చి 1992లో జీవితఖైదు విధించింది. అప్పటికి మోండల్ వయస్సు 72 సంవత్సరాలు. అప్పటి నుంచి 36 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. కలకత్తా హైకోర్టు విచారణ సమయంలో బెయిలుపై విడుదలయ్యాడు. దిగువ కోర్టు జీవితఖైదు విధించడం,హైకోర్టు దానిని సమర్ధించడంతో తిరిగి కరెక్షనల్ హోమ్‌కు వెళ్లక తప్పలేదు.
2020లో పేరోలు మంజూరు కాగా, తిరిగి 2021లో కరెక్షనల్ హోమ్‌కు వెళ్లిపోయాడు. గత నెల సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసే వరకు జైలు లోనే ఉన్నాడు. నిర్దేశించిన శిక్షాకాలంలో జైలు జీవితం లోని వ్యక్తి ఎలాంటి అక్రమ చర్యకు పాల్పడకుంటే ఏ ఖైదీ అయినా జైలు నుంచి విడుదలయ్యే వెసులుబాటు ఉందని తమ న్యాయవాది చెప్పారని మోండల్ కుమారుడు ప్రకాష్ మోండల్ వెల్లడించాడు. మాల్డా కరెక్షనల్ హోమ్ నుంచి మంగళవారం బయటకు మోండల్ రాగానే మొక్కలను పెంచడం, తోటపనిలోనే తన కుటుంబ సభ్యులతో గడుపుతానని పేర్కొన్నాడు. వయసెంత ? అని ప్రశ్నించగా 108 ఏళ్లని గొణిగాడు. అయితే అతని కుమారుడు 104 ఏళ్లని సవరించాడు. కరెక్షనల్ హోమ్ అధికారులు అతనికి 104 ఏళ్ల వయసని రికార్డులు చెబుతున్నాయని వివరించారు. “ జైలులో ఎన్నేళ్లు గడిపానో గుర్తు లేదు. అది ఎప్పటికీ ముగియని కథగా కనిపించింది. నన్ను ఇక్కడకు ఎప్పుడు తీసుకు వచ్చారో కూడా గుర్తులేదని మోండల్ చెప్పాడు.
అతని వయసును బట్టి చురుకుగానే కనిపించాడు. “నేను కుటుంబంతోను, మనుమళ్లతోను గడిపే జీవితాన్ని ఎంతగానో కోల్పోయాను, ఇప్పుడు నా అభిరుచికి తగ్గట్టు ఇంటి పెరటిలో తోటపనిలో గడుపుతాను ” అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. మోండల్ జైలు నుంచి విడుదల కావడం కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించింది. ఆయన 80 ఏళ్లు దాటిన భార్య మీనా మోండల్ తనకెంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. మోండల్ జైలులో నిత్యం వ్యాయామం చేసేవాడు. వయసుకు తగ్గట్టు ఫిట్‌నెస్ పెంచుకున్నాడు.