7.7 తీవ్రతతో ప్రళయం సృష్టించిన భూకంపాలు
మయన్మార్‌లో 186 మంది మృతి, 800 మందికి
గాయాలు నేపిడాలో కుప్పకూలిన 1000 పడకల
ఆస్పత్రి థాయిలాండ్‌లో ముగ్గురు మృతి,
బ్యాంకాక్‌లో ఒకే భవనం కింద 90 మంది
కొనసాగుతున్న సహాయక చర్యలు అంతర్జాతీయ
సాయం కోరిన మయన్మార్ సైనిక ప్రభుత్వం
మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ప్రాచీన
కట్టడాలు నేలమట్టం, రహదారులు ధ్వంసం
రోడ్లపై జనం బిక్కుబిక్కు థాయిలాండ్‌లో హెల్ప్
లైన్ ఏర్పాటు చేసిన భారత ఎంబసీ భారత్, చైనా,
వియత్నాం, బంగ్లాదేశ్‌లలోనూ ప్రకంపనలు
మయన్మార్, థాయిలాండ్ దేశాలు శుక్రవారం భారీ భూకంపం తాకిడికి విలవిలలాడాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం ధాటికి మయన్మార్‌లో 167 మంది మరణించారు. 300 మందికిపైగా గాయపడ్డారు. భారీ భవనాలు నేలమట్టం కాగా, శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు వార్త కథనాలు వెలువడతున్నాయి. జనం వీధుల్లో, రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపున్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనం కుప్పకూలినప్పుడు కనీసం ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, 90 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడారు. మయన్మార్‌లోనే నిమిషాల వ్యవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం ప్రభావంతో భారత్, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లలో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆయా దేశాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4వరకు పరిమితం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. మయన్మార్ రాజధాని నేపిడా, మాండలే సహా ఆరు ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఎమర్జన్సీ ప్రకటించారు. భూప్రకంపల ప్రభావంతో రెండవ పెద్ద నగరం మాండలేలో ఐకానిక్ వంతెన కుప్ప కూలిపోయింది.
నగరంలో భూప్రకంపన తీవ్రత 6.4గా నమోదైంది. దేశంలో పలు చోట్ల ఎత్తైన ప్రార్థనా మందిరాలు, గోపురాలు కూలిపోయాయి. భూకంపం నేపథ్యంలో మయన్మార్ సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోరింది. మానవతా దృక్పథంతో సాయం అందజేయాలని ప్రపంచ దేశాలకు ప్రభుత్వం విజ్ఙప్తి చేసింది. అయితే, దేశం సుదీర్ఘ కాలంగా రక్తసిక్తమైన అంతర్యుద్ధంలో నిమగ్నమైన నేపథ్యంలో పలు ప్రాంతాలకు ఏవిధంగా సాయం అందుతుందో స్పష్టంగా తెలియరావడం లేదు. భూకంపం ప్రధాన కేంద్రం వాయవ్య నగరం సగాయింగ్‌లో 10 నుంచి 30 కిమీ లోతులో ఉన్నట్లు యుఎస్‌జిఎస్ తెలియజేసింది. రాజధాని నేపితాలో ఒక ఆసుపత్రి 20 మరణాలను ధ్రువీకరించింది. మరోవైపు ఇదే నగరంలో 1000 పడకలున్న ఆస్పత్రి కూడా కూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక్కడ భారీ ఎత్తున మరణాలు సంభవించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నేపితాలోని ప్రధాన రహదారుపై భారీగా చీలకలు ఏర్పడ్డాయి. మాండలే, సగాయింగ్‌లను, దక్షిణ షన్ రాష్ట్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న తమ బృందాలకు విద్యుత్ సరఫరా అంతరాయం సవాల్‌గా పరిణమించిందని రెడ్ క్రాస్ వెల్లడించింది.
‘ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంపం వల్ల గణనీయ స్థాయిలో నష్టం సంభవించింది’ అని రెడ్ క్రాస్ తెలియజేసింది. ‘మానవతావాద సాయం అవసరాలపై సమాచారం ఇంకా సమీకరిస్తున్నాం’ అని సంస్థ తెలిపింది. బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనం ప్రదేశం నుంచి శిథిలాలు తన ట్రక్కును బలంగా తాకినప్పుడు ఒక నిర్మాణ కార్మికుడు దుర్మరణం చెందగా, శిథిలాల కింద మరొకరు నలిగిపోయినట్లు సహాయ కార్మికుడు సోంగ్‌వుత్ వాంగ్‌పొన్ విలేకరులతో చెప్పాడు. మొత్తం ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు, 90 మంది గల్లంతైనట్లు థాయిలాండ్ రక్షణ శాఖ మంత్రి ఫుంథామ వెచయచాయి తెలిపారు. ప్రస్తుతం సాగుతున్న రక్షణ, సహాయ కార్యక్రమాల గురించి ఆయన ఇతర వివరాలు తెలియజేయలేదు. కానీ, కూలిపోయిన భవనం వెలుపల నుంచి ఇప్పటి వరకు ఏడుగురిని రక్షించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. బ్యాంకాక్‌కు ప్రముఖ చతుచాక్ మార్కెట్ సమీపంలో భవనం కూలిపోయినప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, టాప్‌లో ఒక క్రేన్ ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలినప్పుడు దుమ్ము ధూళి వ్యాపించగా, జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు తీయడం కనిపించింది. భూకంపం ధాటికి భవనాలు అటూ
ఇటూ ఊగిపోవడంతో జనం రోడ్లపైకి పరుగులు పెట్టారు. భారీ భవంతులపైన ఉన్న స్విమ్మింగ్ ఫూల్స్ నుంచి జలధారలు కిందికి రావడం కనిపించింది. పలు చోట్ల శిథిలాల నుంచి రక్షించమని ఆర్తనాదాలు వినిపించాయి. బ్యాంకాక్‌లో ఇతర ప్రదేశాల్లో తమ భవనాల్లో నుంచి ఖాళీ చేయించిన ప్రజలను దూరంగా ఉండవలసిందని హెచ్చరించారు. మధ్య బ్యాంకాక్ ప్రాంతం అంబులెన్స్‌ల సైరన్ మోతలతో ప్రతిధ్వనించింది. భూకంపం ప్రభావాన్ని మదింపు వేయడానికి ప్రధాని పేతాంగ్‌తార్న్ షినావత్రా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
పురాతన కట్టడాలకు దెబ్బ…
మయన్మార్‌లో రెండవ పెద్ద నగరమైన మాండలేలో భూకంపం పూర్వపు రాజ ప్రాసాదంలో కొంత భాగాన్ని, ఇతర భవనాలను దెబ్బ తీసింది. ఆ ప్రాంతం భూకంపాలకు లోనయ్యేదిగా ఉండగా, నగరంలో చాలా ఇళ్లు తక్కువ ఎత్తైనవి. మాండలేకు నైరుతి దిశలోని సగాయింగ్ ప్రాంతంలో 90 ఏళ్ల నాటి ఒక వంతెన కూలిపోయింది. మాండలే, మయన్మార్‌లోని అతిపెద్ద నగరం యాంగాన్‌ను అనుసంధానించే రహదారిలో కొన్ని భాగాలు కూడా దెబ్బ తిన్నాయి. యాంగాన్‌లో భూకంపం సంభవించినప్పుడు జనం తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, మరణాలు, క్షతగాత్రుల గురించి వార్తలు వెంటనే రాలేదు. మయన్మార్‌కు ఈశాన్యంగా చైనాలోని యునాన్, సిచువాన్ ప్రావిన్స్‌లలో భూకంపం ప్రభావం కానవచ్చింది. మయన్మార్ సరిహద్దులోని రుయిలి నగరంలో ఇళ్లు దెబ్బ తిన్నట్లు, కొందరు గాయపడినట్లు చైనీస్ మీడియా తెలియజేసింది.
ఎమర్జన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన భారత్
థాయిలాండ్‌లో భారతీయుల సహాయార్థం ఎమర్జన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. భూకంపం ప్రభావానికి గురైన భారతీయులు ఈ హెల్ప్‌లైన్ సేవలు ఉపయోగించుకోవాలని థాయిలాండ్‌లోని భారత ఎంబసీ సూచించింది. థాయిలాండ్‌లోని భారత ఎంబసీ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ +66 618819218.
సహాయానికి భారత్ సిద్ధం ప్రధాని మోడీ ప్రకటన
మయన్మార్, థాయిలాండ్‌లలో సంభవించిన బీభత్సకర భూకంపం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాలకు సాధ్యమైన సకల విధ సాయం అందజేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. భూకంపం థాయిలాండ్‌లో రాజధాని బ్యాంకాక్ సహా అనేక ప్రాంతాలను కుదిపివేసింది. వచ్చే వారం బ్యాంకాక్‌లోనే బిమ్‌స్టెక్ ప్రాంతీయ కూటమి శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ ఇతర దేశాల నేతలతో పాటు హాజరు కానున్నారు. ‘మయన్మార్, థాయిలాండ్‌లలో భూకంపం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రతి ఒక్కరి భద్రత, సంక్షేమం కోసం ప్రార్థిస్తున్నాం’ అని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘సాధ్యమైన సకల విధ సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నది. ఈ విషయంలో సంసిద్ధంగా ఉండవలసిందిగా మా అధికారులను కోరడమైంది. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపవలసిందిగా ఎంఇఎను కూడా కోరడమైంది’ అని మోడీ తెలియజేశారు.