పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన ఆర్థికశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు (జిపిఓలను) మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ పోస్టులను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ విఆర్‌ఓలు, మాజీ విఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది. త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇటీవల కేబినెట్ భేటీలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. గతంలో విఆర్‌ఓలుగా పనిచేసి ప్రస్తుతం పలు శాఖల్లో ఉన్న 6 వేల మందిని గ్రామపంచాయతీ పాలనా అధికారులుగా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదనంగా మరో 4 వేల పోస్టులకు ప్రభుత్వం దరఖాస్తులను తీసుకోనుంది. ఉగాది తర్వాత 50 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది.
సిఎం రేవంత్‌కు, రెవెన్యూ మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు: లచ్చిరెడ్డి
10,954 జిపిఓ పోస్టులను మంజూరు చేసినందుకు సిఎం రేవంత్‌కు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రెవెన్యూ జేఏసీ కృషి ఫలితంగానే రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన అధికారుల(జీపీఓ) పోస్టులు మంజూరు అయ్యాయని చైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలనలో సిఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామ పాలన అధికారుల వ్యవస్థను అందుబాటులోకి ప్రభుత్వం తెలుస్తుందన్నారు.