Sunday, January 19, 2025

టెన్త్, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయా బోర్డులు విడుదల చేశాయి. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 80.59 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జూన్ 14 నుంచి జరిగిన ఈ పరీక్షలకు 66,732 మంది విద్యార్థులు హాజరుకాగా, 53,777 మంది(80.59 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 78.50 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 83.50 శాతం అంటే 5 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలలో 99.47 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 53.69 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జవాబుపత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 10 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఎస్‌బిఐ బ్యాంకు ద్వారా చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలను www.bsc.telangana.gov.in, www.results.bsetelangana.org వెబ్‌సైట్లలో చూడవచ్చని తెలిపారు.


ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో గత నెల 12 నుంచి 20 వరకు జరిగిన ఇంటర్ అడ్వానస్డ్ సప్లిమెంటరీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను బోర్డు అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 63 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఒకేషనల్ విద్యార్థులు 55 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌కు చెందిన 2,52,055 మంది విద్యార్థులు అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయగా, 1,57,741 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 18,697 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 10,319 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జనరల్ విద్యార్థులు 46 శాతం, ఒకేషనల్ విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాదికి చెందిన 1,29,494 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయగా, 59,669 మంది ఉత్తీర్ణత సాధించారు.అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 11,013 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 6,579 మంది పాసయ్యారు. ఇంటర్ జవాబుపత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం శనివారం(జులై 8) నుంచి ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News