Thursday, January 23, 2025

పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసు..

- Advertisement -
- Advertisement -

విద్యార్థిపై డీబార్ ఎత్తివేయాలని హైకోర్టు తీర్పు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఓ విద్యార్థిపై అధికారులు పెట్టిన డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ప్రశ్నపత్రం లీక్ ఘటనకు సంబంధించి హనుమకొండ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీశ్‌ను డిఇవొ డీబార్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో విద్యార్థి పదో తరగతి పరీక్షలు రాశారు. కానీ, ఫలితాలను అధికారులు విత్ హెల్డ్ పెట్టారు. తాజాగా డీబార్ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా హరీశ్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశించింది.

కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలుడు ఉప్పల్ గ్రామానికి చెందిన తన స్నేహితుల కోసం చెట్టు కొమ్మ పట్టుకొని ఒకటో అంతస్తులోని పరీక్ష కేంద్రంలోకి చేరుకున్నాడు. అయితే రూం నంబరు 3 కిటికీ చెట్టుకు ఆనుకుని ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ బాలుడు పరీక్ష రాస్తున్న హరీశ్ వద్ద పేపర్ తీసుకుని తన వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. అనంతరం తన స్నేహితులకు చీటీలు ఇద్దామని భావించి హిందీ పరీక్ష పేపర్ ఫొటోలను శివ గణేశ్ వాట్సాప్‌కు పంపించాడు. ఆ ఫొటోను శివగణేశ్ ఎస్‌ఎస్‌సీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. ఆ గ్రూపులో 31 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ఉదయం 9.30 మొదలవ్వగా 9.45 గంటలకు ఆ బాలుడు పేపర్‌ను ఫొటో తీశాడు. ఉదయం 9.55 గంటలకు శివ గణేశ్ ఎస్‌ఎస్‌సీ స్టూడెంట్స్ గ్రూపులో పోస్టు చేశాడు. ఆ తర్వాత కెఎంసి ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహేశ్‌కు క్వశ్చన్ పేపర్‌ను ఫార్వర్డ్ చేశాడు.

అలా అక్కడి నుంచి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ పేపర్ వైరల్ అయింది. అలా వైరల్ అవుతూ ప్రశాంత్ అనే వ్యక్తి వద్దకు చేరింది ఆ ఫొటో ప్రశాంత్ ఆ క్వశ్చన్ పేపర్ ఫొటోను నెట్టింట పోస్టు చేసి ’బ్రేకింగ్ న్యూస్ వరంగల్‌లో హిందీ పేపర్ లీకైందని’ పోస్టులో రాశాడు. అలా క్వశ్చన్ పేపర్ లీక్ వార్త రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురైయ్యేలా ప్రశాంత్ నెట్టింట హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ అనే వార్తను వైరల్ చేశాడు. ఇదే మెసేజ్‌ను హైదరాబాద్‌లో ఉన్న కొందరు మీడియా ప్రజా ప్రతినిధులకు, అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు 11.24 గంటలకు ఫార్వర్డ్ చేశాడు. ఈ మొత్తం విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

పరీక్ష ప్రారంభం కాకముందు ఎగ్జామ్ పేపర్ బయటకు వస్తే లీకేజీ అనీ. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నాపత్రం బయటకు వస్తే కాపీయింగ్ అవుతుందని వరంగల్ సిపి తెలిపారు. నిందితులపై సెక్షన్ 5 ప్రకారం కేసు నమోదు చేశారు. మైనర్‌ను జువైనల్ హోంలో హాజరు పరిచారు. శివ గణేశ్, ప్రశాంత్, మహేశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రశ్నాపత్రం లీకవడానికి సహకరించాడనే ఉద్దేశంతో హరీశ్ అనే విద్యార్థిని డిఇవొ డీబార్ చేశారు. తనకు ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని పరీక్ష రాయించాలని హైకోర్టులో హరీశ్ పిటిషన్ వేశాడు. అలా అప్పుడు హైకోర్టు అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించింది. ఇప్పుడు ఆ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ హరీశ్‌పై డీబార్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News