మనతెలంగాణ/హైదరాబాద్/తాండూరు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ ఘటన కలకలం రేపింది. పదోతరగతి పరీక్ష ప్రారంభమైన నిమిషాల్లోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1 నుంచి తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిం ది. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాల్లోనే అంటే ఉదయం 9.37 గంటలకు వాట్సాప్‌లో ప్రశ్నపత్రం బయటకు వెళ్లింది. ఉపాధ్యాయుడు బం దెప్ప వాట్సాప్ నుంచి బయటకు వెళ్లినట్లు పో లీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటనపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు, పోలీసు లు కారణమైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరుకాని విద్యార్థి ప్రశ్నపత్రాన్ని బందెప్ప అనే ఉపాధ్యాయుడు తీసుకున్నట్లు వెల్లడించారు. తీసుకున్న ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రశ్నపత్రాన్ని బందెప్ప వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసినట్లు వెల్లడించారు. స్కూల్ అటెండర్ తీసుకోవాల్సిన ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయుడు తీసుకున్నాడని తెలిపారు.
నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రశ్నాపత్రం బయటకు రావడానికి కారణమైన ఇద్దరు ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలతో పాటు విద్యాశాఖకు చెందిన గోపాల్, శివ కుమార్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. గది ఇన్విజిలేటర్ శ్రీనివాస్‌ను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇన్విజిలేటర్ శ్రీనివాస్ పాత్రపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ నుంచి నివేదిక కోరిన విద్యాశాఖ
పదోతరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది.ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్‌కు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌పై చర్యలు చేపట్టింది. ముగ్గురు సిబ్బందిని పరీక్షల విధుల నుంచి అధికారులు తొలగించారు.
యథాతధంగా పరీక్షలు : శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు
షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన స్పష్టం చేశారు. నలుగురు ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మంగళవారం జరగబోయే పరీక్షతో పాటు మిగతా పరీక్షలు యథాతధంగా జరుగుతాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు.
అసలు ఏం జరిగింది..?
తాండూర్‌లోని ఒకటవ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభం కాగా, 9.37 నిమిషాలకు పాఠశాలలో పనిచేసే బందెప్ప అనే బయోసైన్స్ ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రాన్ని తన మొబైల్ ద్వారా ఫొటో తీసి ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. తర్వాత వెంటనే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసినప్పటికీ.. గ్రూప్‌లో ఉన్న మిగతా సభ్యులు ఇతరులకు షేర్ చేశారు. వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నపత్రం చక్కర్లు కొడుతున్నట్లు ఎంఇఒకు ఉదయం 11 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే ఎంఇఒ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన పోలీసులు బండెప్ప కారణంగానే ప్రశ్నపత్రం లీకైనట్లు గుర్తించారు.
పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఈఓ రేణుకాదేవి నలుగురు ఉపాధ్యాయులపై సస్పెండ్ వేటు వేశారు. ప్రశపత్రం ఫోన్ ద్వారా ఫోటో తీసిన బందెప్పను, ప్రశ్నపత్రం సెల్‌ఫోన్ ద్వారా తీసుకున్న ఉపాధ్యాయుడు సమ్మప్పను, నెంబరు 1 హైస్కూల్ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా ఉన్న కె.గోపాల్‌ను, పరీక్షా కేంద్రానికి డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న ముద్దాయిపేట్ పాఠశాల హెచ్‌ఎం ఎస్. శివకుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయని ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. ఈ మేరకు ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు విచారణలో తేలిన ఉపాధ్యాయుడు బందెప్పను అదుపులోకి తీసుకున్నట్లు తాండూరు సిఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు.
ఎస్‌ఎస్‌సి బోర్డు ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఎస్‌ఎస్‌సి బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు ఎస్‌ఎస్‌సి బోర్డు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం బోర్డు, గేట్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టెన్త్ పరీక్షలకు తొలి రోజు 99.60 శాతం హాజరు
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలి రోజు 99.60 శాతం హాజరు నమోదైంది. ఈ పరీక్షలకు మొత్తం 4,85,954 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,84,019 మంది హాజరయ్యారని ఎస్‌ఎస్‌సి బోర్డు తెలిపింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు టెన్త్ కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎస్‌ఎస్‌సి బోర్డుగా ఎ.కృష్ణారావు
ప్రభుత్వ పరీక్ష విభాగం(ఎస్‌ఎస్‌సి బోర్డు) సంచాలకులుగా ఎ.కృష్ణారావు నియమితులయ్యారు. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎస్‌ఐఇటి) డైరెక్టర్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం సెలవులో ఉన్నారు. టెన్త్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ ఘటన నేపథ్యంలో కృష్ణారావును వెంటనే ప్రభుత్వ పరీక్ష విభాగం సంచాలకులుగా బాధ్యతలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖలో కీలక విభాగాలలో అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వయోజన విద్య సంచాలకులుగా ఉన్న ఎస్.విజయలక్ష్మి భాయిని సాంకేతిక విద్య డైరెక్టర్‌గా, మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న ఎ.ఉషారాణిని వయోజన విద్యా డైరెక్టర్‌గా, ఎస్‌ఐఇటి డైరెక్టర్‌గా ఉన్న రమణకుమార్‌ను మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ రమణకుమార్‌గా బదిలీ చేశారు.