యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలోని ఎస్‌సి గురుకులలో శనివారం రాత్రి పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలో సంచలనంగా సృ
ష్టించింది. ఒకే గదిలో రెండు ఫ్యాన్లకు ఉరేసుకున్న విద్యార్థులు.. తాము ఎలాంటి తప్పూ చేయలేదంటూ సూసైడ్ లెటర్ రాశారు. ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించాలి. మేము చేయని తప్పునకు అందరూ మమ్మల్నే నిందిస్తుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. తమను శైలజా మేడమ్ తప్ప ఎవరూ నమ్మలేదు. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. మా శైలజ మేడమ్‌ను ఎవరూ అనడానికి వీలులేదు. మా అమ్మ వాళ్ల కంటే మమ్నల్ని ఎక్కువగా చూసుకున్నారు.
సారీ మేడమ్. మా ఆఖరి కోరిక ఒకటే. మేము చనిపోయాక మా ఇద్దర్నీ ఒకే దగ్గర సమాధి చేయండి ప్లీజ్. కానీ, మా మేడమ్‌ని ఒక్క మాట కూడా అనకండి ప్లీజ్’ అంటూ ఉన్న లెటర్ లభ్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా మృతి చెందిన విద్యార్థినుల మృతదేహాలను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన కుటుంబసభ్యులు తమ పిల్లల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లల మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ పిల్లలది ఆత్మహత్య కాదని, ఉరేసి చంపారంటూ ఆరోపించారు. విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇద్దరిదీ ఆత్మహత్యే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
అసలేం జరిగింది.. కోడి భవ్య (15), గాదె వైష్ణవి (15) భువనగిరి ఎస్సీ గురుకులంలో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే ఈ మధ్యే వీళ్లిద్దరిపై 7వ తరగతి విద్యార్థులు టీచర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమను వేధిస్తున్నారంటూ కొందరు జూనియర్స్ వీళ్లిద్దరిపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవి, భవ్యకు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అది తట్టుకోలేకే ఇదరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి:
శనివారం రాత్రి ఊరి వేసుకుని చనిపోయిన ఇద్దరు విద్యార్థుల మరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతి చెందిన తమ పిల్లలు చాలా ధైర్యవంతులని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని తల్లిదండ్రులు తెలిపా. వారిని కావాలనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సూసైడ్ నోట్ కూడా ఫేక్ నోట్ అని, చాలాకాలంగా రాత్రి వేళల్లో వసతిగృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వెంటనే పోలీసులు వసతి గృహం వార్డెన్‌ను, వంట మనుషులను, నైట్ వాచ్ ఉమెన్‌ను ఆటోడ్రైవర్ చింతల ఆంజనేయులను అరెస్టు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని, కుటుంబ సభ్యులతో పాటు మృతుల బంధువులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వసతిగృహాల విద్యార్థులకు రక్షణతో పాటు మనోధైర్యం కల్పించాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఇద్దరు విద్యార్థుల మృతి విషయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా, దోషులకు మరణశిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.
న్యాయం చేస్తాం : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వసతిగృహాల విద్యార్థులకు రక్షణతో పాటు మనోధైర్యం కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల మృతదేహాన్ని పరిశీలించేందుకు వచ్చిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులపై సమగ్ర విచారణ చేపట్టి సంఘటనకు కారకులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతి చెందిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు, కులసంఘాల నాయకులు ధర్నాను విరమించారు.