Wednesday, January 22, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఉదయం 9.30 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం(మార్చి 18) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. పదవ తరగతి పరీక్షలకు 11,469 పాఠశాలల నుంచి మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరవుతుండగా, అందులో బాలురు 2,57,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు 2676 ఛీఫ్ సూపరింటెండెంట్‌లు, 2676 డిపార్ట్‌మెంటల్ అధికారాలను, 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు.అలాగే విద్యార్థులు ఇబ్బంది పడకుండా బస్సులు నడపాలని ఆర్‌టిసిని విద్యాశాఖ కోరింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూసివేసేలా అధికారులు చర్యలు చర్యలు తీసుకున్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. పరీక్ష విధుల్లో ఉండే అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు వాడకూడదని అధికారులు తెలిపారు. పది పరీక్ష విధులు నిర్వహించే ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా ఫొటో ఐడెంటి కార్డు ధరించాలి. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బందిని పరీక్ష ముగిసే వరకు బయటకి వెళ్లేందుకు అనుమతించరు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదని తెలిపారు.
పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు
ప్రతి పరీక్షా కేంద్రంలోని ఛీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News