Monday, December 23, 2024

పదో తరగతి సిలబస్‌లో కోతలు

- Advertisement -
- Advertisement -

కత్తెర పట్టిన ఎన్‌సిఇఆర్‌టి
10 క్లాసు సిలబస్‌లో కోతలు
ప్రజాస్వామ్యం, పార్టీల పాఠాలొద్దు
చెట్టెక్కిన సైన్సు కీలక ఆవర్తన పట్టిక
ఇంధన వనరుల సంగతి ఆవిరి
భారం తగ్గించేందుకు మార్పుల క్రమం
ఇంటర్‌లో చదువుకోవచ్చునని సలహా
న్యూఢిల్లీ : పదవ తరగతి పాఠ్యాంశం నుంచి ప్రజాస్వామ్యం కనుమరుగు అయింది. ఇటీవలి కాలంలో విద్యార్థుల పాఠ్యపుస్తకాల నుంచి పలు అంశాలను విద్యా పరిశోధన, శిక్షణ జాతీయ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) వెల్లడించని పలు కారణాలతో తొలిగించివేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు పదవ తరగతి సిలబస్ నుంచి డెమోక్రసీ, ఆవర్తన పట్టిక (పిరియాడిక్ టేబుల్) , ఇంధన వనరుల పాఠ్యాంశాలకు కత్తెరపడింది. విద్యార్థులపై చదువు భారం పడకుండా ఉండేందుకు తలపెట్టిన పాఠ్యాంశాల హేతుబద్థీకరణలో భాగంగా ఇప్పుడు వీటిని తీసివేసినట్లు ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ దినేశ్ సక్లానీ గురువారం ఓ ప్రకటన వెలువరించారు. ప్రత్యేకించి ప్రజాస్వామ్య భారతదేశంలోని పలు కీలక విషయాలు, అంతర్భాగాలు ఇకపై విద్యార్థులు చదవాల్సిన అవసరం ఉండదు. వీటిని వారు నేర్చుకోవల్సిన పనిలేదని ఎన్‌సిఇఆర్‌టి తెలిపింది. డెమోక్రసీ విభాగంలోని ప్రజాస్వామ్యం పుట్టుపూర్వోత్తరాలు, రాజకీయ పార్టీలు వంటివాటిని ఎత్తివేశారు.

పలు విషయాలను తాజాగా సమీక్షించుకుని ఇప్పుడు ఈ కోతలకు దిగారు. డెమోక్రసీ అంశంలోని ప్రజాస్వామ్యానికి సవాళ్లు పాఠ్యాంశం కూడా తొలిగింపుల క్రమంలోకి వెళ్లింది. ఇక సైన్స్‌కు సంబంధించి రసాయనిక మూలకాల పట్టికను కూడా తీసివేశారు. అదే విధంగా ఇంధన వనరుల విషయాన్ని ఎత్తివేశారు. ఇది పదవ తరగతి వారికి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మార్పులు ఇప్పటివి కావని, కోవిడ్ తరువాతి క్రమంలో విద్యార్థులకు సిలబస్ భారం తగ్గించే దిశలో చేపట్టిన చర్య అని, ఇకపై కూడా ఇటువంటి చర్యలు తప్పవేమో అని డైరెక్టర్ తెలిపారు. కొద్ది రోజులుగా 9,10, 11,12 తరగతుల సిలబస్‌లు తగ్గుతూ వస్తున్నాయి.

అయితే రసాయనిక మూలకాల పట్టికను తీసివేయడం వల్ల సైన్స్ పట్ల విద్యార్థులకు భవిష్యత్తులో వీటి గురించి సరైన అవగావహన ఉండదని పలువురు శాస్త్రీయ విషయాల నిపుణులు విమర్శించారు. అయితే సైన్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి గల విద్యార్థులు వీటిని తరువాతి తరగతులలో నేర్చుకునేందుకు వీలుంటుంది. భారతదేశంలోనే పదవ తరగతి వరకూ సైన్స్ తప్పనిసరి పాఠ్యాంశం. తరువాత వేర్వేరు సబ్జెక్టులు ఎంచుకునేందుకు వీలుంటుంది. పదవ తరగతిలో పీరియాడిక్ టేబుల్ చదువుకోలేని వారు ఇంటర్ దశలో సైన్స్ సబ్జెక్టు ఎంచుకుంటే వీటి గురించి తెలుసుకునేందుకు వీలుంటుంది. పదవ తరగతిలోపు వీటి గురించి అందరికీ తెలియాల్సిన అవసరం లేదనే ఎన్‌సిఇఆర్‌టి వాదన పట్ల విద్యారంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

పిరియాడిక్ టేబుల్ జీవన క్రమ కీలకం
మానవ జీవన పరిణామం సంబంధిత విషయంలో సైన్స్‌లోని పిరియాడిక్ టేబుల్ అత్యంత కీలకమైనదని సైంటిస్టు జోనాథన్ ఒస్‌బార్నో ఒకనొక సందర్బంలో తెలిపారు. జోనాథన్ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డు వర్శిటీలో శాస్త్ర సంబంధిత పరిశోధకులుగా ఉన్నారు. ఈ పట్టిక ఆవిష్కరణ రసాయనికవేత్తల అత్యద్భుత ఆవిష్కరణ అని, జీవన క్రమపు నిర్మాణంలోని క్షేత్రాల కూర్పు ఏ విధంగా జరుగుతుంది? వీటివల్ల విభిన్న రీతిలో వైవిధ్య మానవ లక్షణాలు సంతరించుకుంటాయి? అనే విషయాలు దీని ద్వారా తెలుసుకునేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. అయితే ఈ ప్రాధాన్యతాంశం ఇప్పుడు దేశ విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News