Tuesday, November 5, 2024

పదేళ్లలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళవుతున్నది. పదేళ్ళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిందేమిటి? జరిగిన పరిణామాలేమిటి? ప్రభుత్వాలు, పార్టీలు, సామాజిక వర్గాలు మొదలైనవి సమీక్షించుకోవడం ద్వారా వర్తమాన కర్తవ్యాలను నిర్దేశించుకోవాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమాలు, ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజలు, వారి ఆశలు గత పదేళ్ళలో ఏ మేరకు నెరవేరాయి? ఇకనుండి తీసుకోవాల్సిన కార్యక్రమాలు, పథకాలు ఏమిటి?

1996 నుండి వేగం పుంజుకున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. అనేక పాయలను కలుపుకొని మహాప్రవాహంగా ముందుకు సాగింది.విభిన్న సామాజిక వర్గాలు తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా ఒక్కటై ముందుకు సాగాయి. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఏర్పడినప్పటి ఉత్సాహం, సంతోషం అన్ని వర్గాలకు ఎన్నో ఆశలు కల్పించింది. టిఆర్‌ఎస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఆ పథకాలు, కార్యక్రమాల లిస్టులో 425కి పైగా వివిధ పథకాలు పేర్కొనబడ్డాయి. అవన్నీ ప్రజలు మరిచిపోయారు. ప్రభుత్వం కూడా మరిచిపోయింది. కొన్ని పథకాలే ప్రభుత్వానికి, ప్రజలకు గుర్తుండిపోయాయి.వాటిలో ప్రధానమైనవి కింద పేర్కొంటాను.

1) కొత్త జిల్లాల, మండలాల ఏర్పాటు, 2) గురుకుల పాఠశాలల ఏర్పాటు, 3) ఆసరా పథకం, 4) డబుల్ బెడ్‌రూవ్‌ు పథకం, 5) రైతుబంధు, 6) ధరణి, 7) మిషన్ భగీరథ, 8) మిషన్ కాకతీయ, 9) ఆరోగ్యశ్రీ, 10) హరితహారం, 11) రీజనల్ రింగ్‌రోడ్, 12) రియల్ ఎస్టేట్ అనుమతులు, 13) పారిశ్రామిక అనుమతులు, 14) ధాన్యసేకరణ, 15) పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు, 16)పోలీసు నియామకాలు, 17) షీ టీవ్‌‌సు, 18) సిసి కెమేరాల ఏర్పాటు, 19) ఫ్లై ఓవర్లు, 20) పార్కుల ఏర్పాటు, 21) రోడ్ల వెడల్పు కార్యక్రమాలు, 22) ప్రగతి భవన్, సెక్రటేరియేట్, జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల నూతన భవన నిర్మాణాలు. 23) ఎంఎల్‌ఎ క్యాంప్ ఆఫీస్ నిర్మాణాలు, 24) కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 25) బతుకమ్మ చీరలు, 26) రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, 27) తెలంగాణ సాంస్కృతిక సారథి, కళాకారుల నియామకాలు, 28) బీడీ కార్మికులకు చేయూత, 29) కులాలవారీగా కులవృత్తుల అభివృద్ధి, 30) దళితబంధు, మొదలైనవి. హామీ ఇచ్చి వదిలేసిన వాటిలో ప్రముఖమైనవి. 1) గల్ఫ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, 2) బిసిల అభివృద్ధి, 3) ఎస్‌సిల అభివృద్ధి, 4) ఎస్‌టిల అభివృద్ధి, 5) మైనారిటీల అభివృద్ధి, 6) కులాలవారీగా అభివృద్ధి, 7) నిరుద్యోగులకు ఉపాధి కల్పన, 8) ఉన్నత విద్య అభివృద్ధి, 9) విద్యావంతులకు స్వయం ఉపాధి కల్పన, 10) భూమి లేనివారికి మూడు ఎకరాల భూమి 11) సబ్బండ వర్గాల అభివృద్ధి, 12) జిల్లా స్థాయిలో సాఫ్ట్‌వేర్ రంగం వికేంద్రీకరణ, 13) అభివృద్ధి వికేంద్రీకరణ, 14) నూతన పరిశ్రమల, సంస్థల పునరుద్దరణ; 15) అవినీతి నిర్మూలన, 16) గ్రంథాలయాల అభివృద్ధి, 17) తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు అభివృద్ధి, 18) మహిళల అభివృద్ధి, 19) చేనేత, పవర్‌లూవ్‌ు అభివృద్ధి మొదలైనవి. వీటిలో కొన్ని అసలే చేయనివి. కొన్ని ప్రారంభించి వదిలేసినవి ఉన్నాయి.

సామాజిక వర్గాలవారీగా చూసినప్పుడు బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు కేటాయించిన బడ్జెట్ తక్కువ. కేటాయించిన మేరకు ఖర్చు కూడా చేయలేదు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా తొలిదశలో స్వయం ఉపాధి కోసం కొంత కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎనిమిదేళ్ళు మొండిచెయ్యి చూపడం జరిగింది. చేపల పెంపకం, గొర్రెల పెంపకం వంటి పథకాలతో కులాలవారీగా కులవృత్తుల అభివృద్ధికి చేసిన కృషి సక్రమంగా సాగలేదు. విద్యావంతులకు ఉపాధి కల్పించలేదని విమర్శలు పెరిగాయి. పదేళ్ళలో విద్యావంతులు, నిరుద్యోగులు ముప్పై లక్షలు పెరిగారు. నూతన ఉద్యోగాల కల్పనతో కనీసం 5 లక్షల మంది విద్యావంతులకు ఉపాధి కల్పించడం సాధ్యమే.

ఆ పని చేయలేకపోయారు. ఈ కొత్త ప్రభుత్వం ఈ పని చేస్తే విద్యావంతులు చాలా సంతోషిస్తారు. ఉద్యోగం దొరికితే పెళ్లి చేసుకుంటామని లక్షలాది మంది పెళ్లిళ్లు వాయిదాలు వేసుకున్నారు. పైగా నిరుద్యోగులకు పిల్లను ఎవరు ఇస్తారు? 50కి పైగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఛైర్మన్లను నియమించి పలువురికి స్థానం కల్పించారు. తెలంగాణ ఉద్యమకారులలో కొంత మందిని రాజకీయాల్లో, నామినేటెడ్ పదవుల్లోతీసుకొని సముచిత స్థానం ఇచ్చారు. అందులో భాగంగా బిసి కమిషన్ ఛైర్మన్‌గా నాకు బాధ్యతలు అప్పగించారు. దానికి సంబంధించిన పనులు అప్పగించారు. చేశాము. కులగణన కోసం జిఒ ఇచ్చి బడ్జెట్ ఇవ్వడం మరిచారు. అన్ని కార్పొరేషన్లది ఇదే దుస్థితి. పేరుకి కార్పొరేషన్లు. ఇక నుండి వీటికి బడ్జెట్‌లు కేటాయించి చక్కగా ప్రజలకు సేవ చేసేట్టు చూడడం అవసరం.

భూమి లేనివారికి మూడు ఎకరాల భూమి కొని ఇస్తామని చెప్పి ఆచరించలేదు. రాజ్యాంగం పరంగా రావాల్సిన ఎస్‌సి, ఎస్‌టి కాంపొనెంట్ ఫండ్స్‌ని రకరకాల పేర్లతో వాడుకున్నారు తప్పితే స్పష్టంగా వారి అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్ అని లెక్కదీసి చెప్పలేకపోయారు. మామూలుగా ప్రభుత్వం నడిచినప్పటికీ ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడం జరిగింది. తెలంగాణలోని కోటి కుటుంబాలపై గత పదేళ్ళలో గత ప్రభుత్వం ఆరు లక్షల చొప్పున అప్పు మీద వేసింది. దీనికి కట్టే కిస్తులు, వడ్డీ బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు కేటాయించిన బడ్జెట్‌కన్నా ఎక్కువైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి రాకుండానే అసలు, వడ్డీలు కట్టవలసి వస్తున్నది. ఈ అప్పులన్నిటినీ 9 శాతం వడ్డీ నుండి 2 శాతం వడ్డీకి వచ్చేవిధంగా రీఆర్గనైజ్ చేసుకోవాలని నూతన ప్రభుత్వం ఆలోచించడం సంతోషకరమైన విషయం.

పేదల స్వంత ఇంటి కల సాకారం చేసే డబుల్ బెడ్‌రూవ్‌ు పథకం గ్రామంలో ఎన్నో ఆశలు కల్పించింది. డబుల్ బెడ్‌రూవ్‌ు కట్టడానికి ఆరు నెలలు చాలు. అలా యేడాదిలోపే టెండర్లు పూర్తి చేసి కలెక్టర్ ద్వారా ప్రతి సంవత్సరం పంపిణీ చేయడం సాధ్యమే. ఆ పని చేయకుండా పదేళ్లుగా కట్టినవాటిని కూడా ప్రజలకు వెంటది వెంట అందించలేదు. వీటిని ఇప్పుడు మరమ్మతులు చేసి వెంటనే నూతన ప్రభుత్వం ప్రజలకు కేటాయించి ప్రశంసలు పొందవచ్చు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి యేడాదిలో ప్రజలకు వెంటది వెంట పంపిణీ చేయడం ద్వారా ప్రజల స్వంత ఇంటి కల నెరవేర్చవచ్చు. మిషన భగీరథ పేరిట చాలాచోట్ల పైపులు వేశారు. రక్షిత నీరు ఇవ్వడం మరిచారు. వీటిని వెంటనే వినియోగంలోకి తెచ్చి నూతన ప్రభుత్వం ప్రజల మన్నన పొందవచ్చు. స్వయం ఉపాధి కల్పన దశల వారీగా చేపట్టడం అవసరం. విద్యార్హతలను అనుసరించి వారి ఉద్యోగ కల్పన చేయలేదు. నూతన ప్రభుత్వం ఈ కర్తవ్యం చేపట్టాలి. ఓన్ యువర్ ఆటో, ఓన్ యువర్ క్యాబ్, ఓన్ యువర్ పవర్ లూవ్‌ు, ఓన్ యువర్ హ్యాండ్లూవ్‌ు పథకాలతో వాటికి స్వంత వారిని చేస్తే వారి ఆదాయం రెట్టింపు అవుతుంది.

కూరగాయల చిన్న వ్యాపారులు, బండి వ్యాపారులకు చేయూతనిచ్చి అసంఘటిత కార్మికులకు, కూలీలకు ప్రావిడెడ్ ఫండ్ ఒక కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చి ప్రావిడెడ్ ఫండ్ ఖాతా ఏర్పాటు చేయడం అవసరం. ఇండ్లల్లో పనిచేసే పని మనుషులకు, పార్ట్ టైవ్‌ు వర్కర్లకు గంటకు ఇంత అని పట్టణాల్లో, నగరాల్లో కనీస కూలీ నిర్ణయించి ప్రావిడెండ్ ఖాతా ఏర్పాటు చేయడం అవసరం. అసంఘటిత ప్రజలే ఉత్సాహంగా ఓట్లు వేసి గెలిపిస్తున్నారు అని మరిచిపోకూడదు. సంఘటిత రంగంలోని విద్యావంతులు చాలామేరకు ఓట్లు వేయడానికి రావడం లేదు. గతంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించారు.కులగణన వెంటనే చేపట్టి హైకోర్టు అడిగిన వివరాలు సమర్పిస్తే ఆ రిజర్వేషన్లు పెరిగి ఉండేవి. అలా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి బిసి రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లు మొదలైనవి పూర్తి స్థాయిలో జనాభా దామాషా మేరకు పెంచి ఎన్నికలు నిర్వహించడం అవసరం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సెక్రటేరియేట్‌కి రాకపోవటం, ప్రజలకు అందుబాటులోకి లేకపోవడం అనేవి ప్రజలను అసంతృప్తికి గురిచేశాయి.

తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎవరిని కలవాలో అగమ్యగోచర పరిస్థితి కొనసాగింది. మంత్రులకు, ఎంఎల్‌ఎలకు అధికారాలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి ఎవ్వరికీ అందుబాటులో లేరు. అలా పరిపాలన కుంటుపడింది. ఈ విషయంలో నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎంఎల్‌ఎలు తమ తమ అధికార పరిధులతో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం అందుబాటులో ఉండడం అవసరం. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవ్వరు వెళ్లినా పది నిమిషాల్లో అపాయింట్‌మెంట్ దొరికేదని తమ సమస్య పరిష్కారం కోసం వెంటనే ఆదేశించేవారని అంటుంటారు. అలా ప్రజలకు అందుబాటులో ఉండటం అవసరం. సెక్రటేరియేట్‌కు రాని ముఖ్యమంత్రిగా కెసిఆర్ భారత దేశంలోనే గొప్ప చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అది ఒక చీకటి అధ్యాయంలాగా మారిపోయింది. చెప్పడానికి ఎన్నో కార్యక్రమాలు మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి మనకు అందుబాటులో లేకపోతే అలాంటివారిని ఎన్నుకోవడం దేనికి? ఇదే ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణం. అందువల్ల నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటది వెంట పరిష్కరిస్తే పదేళ్ళ చీకటి అధ్యాయంపై కొత్త వెలుగులు ప్రసరిస్తాయి. అయితే పదేళ్ళలో మొత్తం చీకటి అధ్యాయం ఉందని కాదు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు. వాటిపై వందలాది వ్యాసాలు రాశాను. ఐదు పుస్తకాలు వేశాను. అవన్నీ రికార్డయ్యాయి. ఒక మొత్తంగా చూసినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకపోవడమే చీకటి అధ్యాయం.

బి.ఎస్. రాములు
(సామాజిక తత్వవేత్త)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News