మహారాష్ట్రలో దారుణం.. ఆసుపత్రి మంటల్లో పది మంది బలి
రోజులు నిండకముందే నూరేళ్లు
భండారా: అప్పుడే పుట్టిన పసికందులు, జన్మించి పట్టుమని పది నుంచి మూడు నెలలు కూడా కాలేదు. లోకం చూద్దామనుకున్న ఈ పారిజాతపు నవజాత శిశువులు అర్థరాత్రి దాటిన తరువాత ఆసుపత్రిలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో మసి అయ్యారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఈ ఘోర విషాదం జరిగింది. జిల్లా జనరల్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సా విభాగంలో ఊయలలో ఉన్న పది మంది చిన్నారులు లోపల చెలరేగిన మంటలకు ఆహుతి అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలవరం కల్గించింది. అర్థరాత్రి దాటి రెండు గంటల సమయంలో దుర్ఘటన జరిగింది. నాలుగు అంతస్తుల ఈ ఆసుపత్రి భవనంలో ప్రత్యేకంగా నవజాత శిశువుల సంరక్షణా చికిత్స విభాగం ఉంది. ఇందులో మొత్తం 17 మంది శిశువులను చేర్పించారు. తొలుత ఈ విభాగంలో నుంచి పొగలు వెలువడ్డాయి. దీనిని గుర్తించిన నర్సులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ లోగానే మంటలు వ్యాపించినట్లు అధికారులు ఆ తరువాత వెలువరించిన ప్రకటనలో తెలిపారు. ఈ ఆసుపత్రిలో పసికందుల చికిత్సలు, సంరక్షణకు రెండు వేర్వేరు విభాగాలు ఉన్నాయి. లోపలివార్డులో ఉన్న పసికందులు చుట్టుముట్టిన మంటలు, దట్టమైన పొగలతో ఊపిరాడకపోవడంతో కన్నుమూశారు. మరో వార్డులో ఉన్న ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు. దీనితో వారి ప్రాణాలు నిలిచాయి. షార్ట్ సర్కూట్తోనే ప్రమాదం జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై మరింత తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. మంటలను గమనించగానే తమ సిబ్బంది సాధ్యమైనంత వరకూ వాటిని ఆర్పేందుకు యత్నించారని, అగ్నిమాపక దళాలకు సమ చారం అందించారని ఆసుపత్రి నిర్వాహకులు అయిన జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖన్దాతే తెలిపారు. అయితే పది మంది పిల్లలు మంటల్లో చిక్కుకున్నారని వివరించారు. ఘటన తరువాత ఇతర వార్డులు, విభాగాల్లోని పెషెం ట్లకు సరైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. వెంటనే ఆరోగ్య మంత్రి రాజేష్ తోపేతో మాట్లాడారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పిలతో కూడా విషయం గురించి ఆరా తీశారు. జరిగిన విషాద ఘటన తన హృదయాన్ని కదిలించివేసిందని ప్రధాని మోడీ ట్వీట్ వెలువరించారు. ఈ లోకాన్ని చూడాల్సిన పసి ప్రాణాలు ఆరిపోవడం బాధాకరం అని, పిల్లలను కొల్పోయిన తల్లిదండ్రుల మానసిక క్షోభను తాను అర్థం చేసుకుంటున్నానని, వారికి సంతా పం వ్యక్తం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆసుపత్రికి మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ తరలివెళ్లారు. పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శిశువులు మృతి చెందిన ఘటనపై పిల్లల హక్కుల పరిరక్షణ జాతీ య కమిషన్ (ఎన్సిపిసిఆర్) స్పందించింది. వెంటనే దీనిపై దర్యాప్తు జరిపి, 48 గంటలలో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్కు లేఖ పంపించింది.
10 newborns died in massive blaze at Bhandra Hospital