Wednesday, January 22, 2025

శంషాబాద్‌లో 11.53 కోట్ల హెరాయిన్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

కడుపులో 109 క్యాప్సుల్స్ దాచిన ప్రయాణీకుడు


మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో 109(హెరాయిన్)డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను కడుపులో దాచిన టాంజానియా దేశస్థుడిని బుధవారం నాడు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన తర్వాత అతని ప్రవర్తన గమనించిన అధికారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణీకుడి లగేజీని పరిశీలించగా ఏలాంటి డ్రగ్స్ లభించలేదు. అయితే ప్రయాణీకుడి నడకలో మార్పు గమనించిన కస్టమ్స్ అధికారులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి 11.53 కోట్ల విలువ చేసే 1389.100 గ్రాముల హెరాయిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

జొహెన్సెస్ బర్గ్ నుండి వయా అబూదాబి మీదుగా హైదరాబాద్ వచ్చిన విదేశీయుడు 109 క్యాప్సూల్ రూపంలో హెరాయిన్ కడుపులో దాచినట్లు కస్టమ్స్ అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌తో పట్టుబడిన 50 ఏళ్ల టాంజానియా దేశస్తుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం కోర్టు అనుమతితో ఆస్పత్రిలో చేర్పి చికిత్స అందిస్తున్నారు. నిందితునిపై ఎన్‌డిపిసి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో టాంజానియాకు చెందిన ప్రయాణీకుడి కడుపులో 57 క్యాప్సిల్స్ రూపంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు.

ఇది జరిగింది:

ఏప్రిల్ 26న జోహనెస్‌బర్గ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన టాంజానియా ప్రయాణికుడిని అనుమానంతో కస్టమ్స్ ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు క్షుణ్నంగా తనిఖీ చేశారు. వైద్య పరీక్షలలో నిందితుడు హెరాయిన్ క్యాప్సూల్స్ మింగినట్లు వైద్యులు గుర్తించి విషయం కస్టమ్స్ అధికారులకు చేరవేశారు.దీంతో కస్టమ్స్ అధికారుల అనుమతిలో సదరు ప్రయాణీకుడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు ప్రయాణికుడి కడుపులో దాచిన 109 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు. మొత్తం 109 క్యాప్సూల్స్‌లో హెరాయిన్ బరువు 1,389 గ్రాములు ఉండగా వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 11.53 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News