సికింద్రాబాద్ గోడౌన్‌లో
11 మంది ఆహుతి
ప్రాణాలతో బయటపడిన ఒక కార్మికుడు
మృతులంతా బీహార్ వాసులే
రాష్ట్రపతి,ప్రధాని, ఉప రాష్ట్రపతి, గవర్నర్, సిఎం కెసిఆర్ ప్రభృతుల
దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు గంటల పాటు శ్రమించి
మంటలను ఆర్పిన రెస్కూ టీం కాలి బొగ్గులుగా మారిన మృతదేహాలు
ఇద్దరు మినహా మిగతా వారందరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు
తుక్కు గోడౌన్ యజమాని నిర్లక్షమే ప్రమాదానికి కారణం బతికి
బయటపడ్డ ప్రేమ్‌కుమార్ మిగతా వారు మంటల్లో చిక్కుకోగా
కిటికీలోంచి దూకేసిన ప్రేమ్‌కుమార్ గోడౌన్ యజమాని సంపత్
అరెస్టు.. 304 (ఎ), 337 కింద కేసు నమోదు మృతుల
కుటుంబాలకు రూ.2లక్షలు ప్రకటించిన ప్రధాని మోడీ ప్రమాదంపై
హోం మంత్రి విస్తృత సమీక్ష ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండేళ్లుగా మేమంతా గోడౌన్‌లో
పనిచేస్తున్నాం.. నేను, 11మంది అంతస్తులో నిద్రపోయాం
రాత్రి 3గంటల సమయంలో మంటలు చెలరేగాయి: ప్రేమ్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయగూడ తుక్కు గోదాములో బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది బీహార్ కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద ఘటన జరిగిన సమయంలోతుక్కు గోదాములో 12 మంది కార్మికులు ఉన్నారని, మంటలు వ్యాపిస్తున్న సమయంలో అప్రమత్తమైన కార్మికుడు ప్రేమ్‌కుమార్ భవనంపై నుంచి దూకి సురక్షితంగా బయటపడ్డాడు. తుక్కు గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అదే భవనంలో గోడౌన్‌కు వ్యాపించినట్లు పోలీసు,అగ్నిమాపక శాఖ అధికారుల ప్రాధమిక విచారణలో తేలింది. తొలుత తుక్కు గోదాములో అంటుకున్న మంటలు పైన కార్మికులు నివాసముంటున్న గదులకు వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న 11 మంది కార్మికులు మరణించారు.అగ్ని ప్రమాదంలో సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజేశ్(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26)లు మృతి చెందారు.
తుక్కు గోదాములో కట్టెలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించి అక్కడే నిద్రిస్తున్న వారిలో కొందరు సజీవ దహనం కాగా మరికొందరు పొగకు ఊపిరాడక మృత్యువాత పడ్డారని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యాధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులకు ఫోన్ రావడంతో చిక్కడపల్లి ఎసిపి వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్, గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ ఎఎస్‌ఐ నాజర్‌లు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రేమ్ అనే కార్మికుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో చికిత్స కోసం అతన్ని వెంటనే 108 అంబులెన్స్ వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. తుక్కు గోదాములో ఫైర్ సెఫ్టీ ప్రికాషన్స్ తీసుకోని కారణంగానే ప్రమాదం జరిగిందని, అలాగే మంటల ధాటికి గోడౌన్ కప్పు కూలిపోవడంతో కార్మికులు సజీవ దహనం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ప్రమాదం నుంచి బయటపడిన ప్రేమ్‌కుమార్ ఫిర్యాదుతో తుక్కువ్యాపారి,గోడౌన్ యజమాని సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై 304ఎ, 337 కింద కేసు నమోదు చేశారు.
3 గంటలు శ్రమించిన రెస్కూటీం
బోయగూడలోని తుక్కు గోదాములో అగ్ని ప్రమాద చోటుచేసుకుందన్న సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్ల సహాయంతో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది తెల్లవారుజామున ఆరుగంటల నలభై ఐదు నిమిషాలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే తుక్కు గోదాంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, కాటన్స్, స్క్రాప్, కేబుల్స్, గోడౌన్‌లో ఉన్న కరెంటు వైర్ బండిల్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి. కాగా మంటలు అదుపులోకి రాగానే రెస్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది గోడౌన్‌లోని మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అయితే పదకొందు మంది కార్మికులు గుర్తుపట్టలేని స్థితిలో సజీవ దహనం కావడంతో మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గోడౌన్‌లోకి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు ఒకే దారి కావడం, అందులోనూ బిల్డింగ్‌పైకి ఎక్కేందుకు ఇనుప మెట్లు ఉంటడంతో మృతదేహాలను తీసుకురావడం కష్టతరంగా మారిందని పోలీసులు పేర్కొన్నారు.
నాలుగు టీంలతో పోస్టుమార్టం
అగ్నిప్రమాదంలో సజీవదహనమైన మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో నాలుగు బృందాలు పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను బీహార్‌కు తరలించేంత వరకు పాడవకుండా తొలుత డెడ్‌బాడీలకు ఎంబామింగ్ చేసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మూడు ప్రక్రియలను ఏకకాలంలో గాంధీ వైద్యులు పూర్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియోలు తీయడంతో పాటు హైదరాబాద్ కలెక్టర్, సిపి సి.వి ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా స్వస్థలాలకు పంపిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆస్పత్రి వద్ద అదనపు బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించామని సిపి మీడియాకు వెల్లడించారు. కాగా ప్రమాదంలో ఇద్దరు మినహా మిగతా వాళ్లు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి పోయాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి : రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా
బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మరణించడం పట్ల సంతాపం తెలియజేయడంతో పాటు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఘటనలో చనిపోయిన బిహార్ కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ సోమేశ్‌కుమార్‌ను సిఎం ఆదేశించారు.
ప్రమాదంపై హోంమంత్రి సమీక్ష
అగ్నిప్రమాదం ఘటనపై పోలీస్, జిహెచ్‌ఎంసి, ఫైర్ అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడెక్కడ ఇలాంటి గోదాములలో పనిచేస్తున్నారనే వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులకు హోంమంత్రి అదేశాలిచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, జనావాసాల మధ్య ఉన్న గోదాములను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలిచ్చారు. అదేవిధంగా గోదాములలో రాత్రివేళల్లో కూలీలు ఉండకుండా చూడాలని, కూలీలకు వసతిని యజమానులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఉన్న గోదాములను గుర్తించి నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.
బాధిత కుటుంబాలకు మంత్రి తలసాని భరోసా..
అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంపై వివరాలు పోలీసులను అడిగి తెలుసుకుని ఘటనపై విచారణకు పోలీసులను ఆదేశించారు. ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఈ ఘటనపై వీలైంత త్వరగా విచారణ చేసి పూర్తి వివరాలు అందించాలని సిపి సివి ఆనంద్‌కు ఆదేశాలిచ్చామని మంత్రి తెలిపారు.
ఘటనపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి
సికింద్రాబాద్ బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళి సై, బిహార్ సిఎం నితీశ్ కుమార్ సహా రాష్ట్ర బిజెపి, కాంగ్రెస్ నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. అలాగే మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈక్రమంలో బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. బోయగూడ అగ్నిప్రమాద ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 11 మంది కార్మికులు చనిపోవడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపమే ప్రమాదాలకు కారణమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.
యజమాని నిర్లక్షమే కారణం : ప్రత్యక్ష సాక్షి
బోయిగూడ అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రేమ్‌కుమార్ పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు. ఈ పమాదంపై పోలీసులు బాదితుడు ప్రేమ్‌కుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. తుక్కు గోడౌన్ యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితుడు తెలిపాడు. తాను రెండేళ్లుగా గోదాంలోనే పనిచేస్తున్నానని, తనతో పాటు 11 మంది గోదాం మొదటి అంతస్తులో నిద్రపోయామని చెప్పాడు. చిన్న రూమ్‌లో తనతోపాటు బిట్టు, పంకజ్ ఉన్నారని, మరో గదిలో మిగతా 9 మంది కార్మికులు పడుకున్నారని ప్రేమ్‌కుమార్ వెల్లడించాడు. రాత్రి 3 గంటల సమయంలో పొగలతో మంటలు వచ్చాయని, బయటకు వెళ్లేందుకు ప్రయత్నించామని, కానీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని తెలిపాడు. తాను కిటికీలోంచి బయటకు దూకానని ప్రేమ్‌కుమార్ వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారని తెలిపాడు. అప్పటికే వాళ్లంత చనిపోయారని వెల్లడించాడు. ప్రేమ్‌కుమార్ ఫిర్యాదుతో బోయిగూడా అగ్నిప్రమాదంపై తుక్కువ్యాపారి,గోడౌన్ యజమాని సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై 304ఎ, 337 కింద కేసు నమోదు చేశారు.
గోదాముల కూల్చివేత
బోయగూడలో అగ్నిప్రమాదం జరిగిన గోదాంను జిహెచ్‌ఎంసి సిబ్బంది మూడు జెసిబిలతో కూల్చివేశారు. ప్రమాద స్థాయిలో ప్లాస్టిక్ గోదాం ఉండడంతో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన గోదాం వైపు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. ప్రమాదాలు చోటుచేసుకునే గోదాములను గుర్తించి కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు
సికింద్రాబాద్ బోయగూడలో అగ్నిప్రమాదంలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పని కోసం వలస వెళ్లిన తమవారు అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల్లో 8 మంది బీహార్‌లోని చాప్రాకు చెందినవారు కాగా ముగ్గురు కతిహార్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చారు. చింటు, దామోదర్, రాజేశ్.. కతిహార్‌కు చెందిన వారు కాగా మిగతా మృతులు చాప్రాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత.. కుటుంబీకులకు మరణ వార్త చేరడంతో వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికు గురయ్యారు.
గాంధీ ఆసుపత్రికి
పెద్దఎత్తున చేరుకున్న
బీహారీలు
మృతులను గుర్తించిన ప్రేమ్‌కుమార్
మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్‌లో పనిచేస్తున్న బీహారీల సంఘం సభ్యులు గాంధీ ఆస్పత్రికి బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోయిగూడ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారు బీహారీలు కావడంతో నగరంలో పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు భారీగా తరలివచ్చారు. వందలాది మంది బీహారీలు గాంధీ ఆస్పత్రి వద్ద సాయంత్రం వరకు వేచి ఉన్నారు. కాగా మృతిచెందిన వారిని గుర్తించేందుకు అగ్నిప్రమాదం నుంచి బయటపడి గాంధీలో చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు మార్చురికి తీసుకురాగా అక్కడ స్ట్రెచర్‌పై ఉన్న మృతదేహాలను గుర్తించాడు.