తొమ్మిది మంది గల్లంతయ్యారు
హైదరాబాద్: పశ్చిమ ఇండోనేషియాలో 78 మందితో ప్రయాణిస్తున్న స్పీడ్‌బోట్ శుక్రవారం మునిగిపోయింది. గల్లంతైన తొమ్మిది మంది కోసం రెస్కూయర్లు వెతుకుతున్నారు. వారు ఇప్పటికే 11 మంది మృత దేహాలను వెలికి తీశారు. వారిలో చాలా వరకు మహిళలు, పిల్లలే ఉన్నారు. ఇప్పటి వరకు 58 మందిని కాపాడారు. ఈ వివరాలను పెంకన్‌బరు సెర్చ్ అండ్ రెస్కూ ఏజెన్సీ చీఫ్ న్యోమన్ సిధకర్య తెలిపారు. పడవపై నిలుచున్న వారు అది తల్లకిందులు కావడంతో నీళ్లలో మునిగిపోతున్న దృశ్యాన్ని స్థానిక టెలివిజన్ చూయించింది. ఎవెలిన్ కాలిస్టా 01 అనే ఆ పడవలో 72 మంది ప్రయాణికులు, ఆరుగురు పడవ సిబ్బంది పయనించారు. వారంతా తమ ఊళ్లలో కుటుంబ సభ్యులతో ఈద్‌ఉల్‌ఫితర్ పండుగ జరుపుకుని తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గురువారం తెంబిలహన్ రేవు పట్టణం వదిలిన మూడు గంటలకే ఆ పడవ మునిగిపోయింది.
పడవ ఎలా మునిగిపోయిందన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. పడవ ఒక్కసారిగా ఊగిపోయి పడిపోయిందని కొందరు చెబుతున్నారు. తీవ్రమైన గాలి తాకడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చంటున్నారు. ఇండోనేషియాలో పడవ ప్రమాదాలు అన్నవి చాలా సాధారణం. అక్కడ 17000 ద్వీపాలుంటాయి. అక్కడ ఫెర్రీలు వాడటం జరుగుతుంటుంది. భద్రత నియమాలు ఏవి పాటించరు. ఇదివరలో కూడా ఇండోనేషియాలో పడవ ప్రమాదాలు అనేక మార్లు జరిగాయి.వాటన్నిటిలో అతి పెద్దది 1999లో జరిగింది. నాడు పడవ మునిగి 332 మంది చనిపోయారు. కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో బతికారు.