తిరువనంతపురం : కేరళలో ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మల్లాప్పురం జిల్లాలోని తనూర్ వద్ద పర్యాటకులతో కూడిన పడవ ప్రయాణ దశలో బోల్తా పడింది. దీనితో 11 మంది వరకూ జలసమాధి అయినట్లు వెల్లడైంది. మృతులలో నలుగురు బాలలు కూడా ఉన్నారు. సముద్రానికి సమీపంలోని ఒట్టుపురం వద్ద ఉండే తూవాల్ తీరం వద్ద పురపుజా నది జలాల్లో ఈ బోటు సాగుతూ ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై రాష్ట్ర మంత్రి వి అబ్దురహిమాన్ స్పందించారు. గజ ఈతగాళ్లను అక్కడికి పంపిస్తున్నట్లు తెలిపారు.
Also Read:
బోటులో 30 నుంచి 40 మంది వరకూ ఉన్నారని ఘటన తరువాత ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చిన ఓ యువకుడు తెలిపారు. గత నెలలోనే కేరళలో తొలి ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో బోటు షికార్లకు వెళ్లుతూ వస్తున్నారు. విహార యాత్రల బోటింగ్‌లకు కేవలం సాయంత్రం ఐదు గంటల వరకూ అనుమతి ఉందని, అయితే దీనిని పట్టించుకోకుండా రాత్రిపూట కూడా కొన్ని బోట్లు సంచరిస్తున్నాయని తనూర్ మున్సిపాల్టీ కౌన్సిలర్ పిపి ముస్తాఫా తెలిపారు.