నిషేధిత గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా..నేరగాళ్లు మాత్రం హైటెక్ మాటున గంజాయి దందాను కొనసాగిస్తుండడం గమనార్హం. మంచిర్యాల జిల్లా పరిధిలో సిసి కెమెరాల వ్యాపారం మాటున కొనసాగుతున్న గంజాయి దందాను మంచిర్యాల పోలీసులు ముఠా గుట్టు రట్టు చేసి 20.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు, 11 మందిని అరెస్టు చేసారు. గురువారం రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ గంజాయి ముఠా వివరాలను వివరించారు. సిపి కథనం ప్రకారం… మంచిర్యాల ఐబి ఎక్స్‌రోడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ కింద గల సెల్లార్‌లో సోమ ప్రవీణ్‌కుమార్‌కు సంబంధించిన వై ఇన్‌ఫో సొల్యూషన్ సిసి కెమెరా గోదాంలో నిలువ ఉన్న గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. పక్కా సమాచారం మేరకు గోదాం దగ్గర దాడులు చేయగా కాటన్ బాక్స్‌లో ప్యాక్ చేసి ఉన్న గంజాయితోపాటు అక్కడ ఉన్న కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగిందన్నారు.
మంచిర్యాల రాజీవ్ నగర్‌కు చెందిన ఇరుగురాళ్ల సతీష్‌కుమార్, సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ 4కు చెందిన మహ్మద్ సమీర్, అశోక్‌రోడ్‌కు చెందిన భీమా అనుదీప్, తిలక్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఉబేద్, కరీంనగర్ హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన అర్జున్ బాబురావ్ చౌహాన్, కరీంనగర్ ఖార్ఖనగడ్డకు చెందిన మహ్మాద్ అజీజ్, మంచిర్యాల రాజీవ్‌నగర్‌కు చెందిన జాడి రాఘవేంద్రస్వామి, సిసిసి నస్పూర్ గాంధీనగర్‌కు చెందిన గూడురు రాము, ఎస్‌కె ఇస్మాయిల్, ఎస్‌కె. సమీర్, ఒక మైనర్ ను అరెస్టు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే గంజాయి దందా తో సంబంధం ఉండి పారిపోయిన మంచిర్యాల ఎన్‌టిఆర్ నగర్‌కు చెందిన సోమ ప్రవీణ్, తగరపు రాజు, తగరపు శృతి, తగరపు వినయ్, రామాలయం రాకేష్, శ్రీధర్, మున్నీ, చింటు(వికలాంగుడు), అల్మేకర్ శ్యామ్, క్వార్టర్ సాయి, సోహాల్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుండి 20.5 కిలలో గంజాయి, 11 ఫోన్లు, 5 బైక్‌లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ గంజాయి దందా కొనసాగుతున్న తీరుపై వివరించారు. ఇరుగురాళ్ల సతీష్ ఆటోడ్రయివర్‌గా పని చేస్తూ జల్సాలకు అలవాటు పడడం జరిగిందన్నారు. ఎక్కువ డబ్బు సాధించాలనే ఉద్దేశంతో తన స్నేహితుడు సిసి కెమెరాల వ్యాపారం చేసుకునే సోమ ప్రవీణ్‌తో కలసి గంజాయి విక్రయించేందుకు పథకాలు రచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు నుండి గంజాయిని 75 వేల రుపాయలతో 15 కిలోల ఎండు గంజాయిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తెచ్చి ఇవ్వగా నిందితులు గంజాయిని బీజాపూర్, మేడారం, మంథిని, గోదావరిఖని, మీదుగా మంచిర్యాలకు తీసుకొని వచ్చి ప్రవీణ్‌కు సంబంధించిన సిసి కెమెరాల గోదాంలో అందరు సమానంగా పంచుకొన్నారని ఆయన తెలిపారు. ఆ గంజాయిని వీరు సేవిస్తూ గంజాయి తాగే యువకులకు 200, 300 రూపాయలకు ఒక ప్యాకెట్ విక్రయించడం జరిగిందని ఆయన తెలిపారు.
తిరిగి ఫిబ్రవరి న అందరు కలసి కారుకు ముందు, వెనక ఎస్కార్ట్‌గా బైకులతో సీలేరు వెళ్లి అక్కడ లక్షా 75 వేల రూపాయలకు 35 కిలోల గంజాయిని ఇవ్వగా గంజాయిని తీసుకొని వచ్చి సిసి కెమెరాల గోదాంలో ఉంచి పంచుకునే ప్రయత్నంలో తమకు అందిన పక్కా సమచారం మేరకు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గంజాయి ముఠాపై ఎన్‌డిపిఎస్ యాక్టు ప్రకారం మంచిర్యాల సిఐ ప్రమోద్‌రావ్ కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్, ఎసిపి ప్రకాష్, టాస్క్‌ఫోర్స్ సిఐ లు రాజ్‌కుమార్,, రమేష్, ఎసై లు లచ్చన్న, ఉపేందర్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గోన్నారు.