Sunday, December 22, 2024

స్కూల్ జిమ్ కూలి 11 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలో ఓ స్కూల్ జిమ్ పై కప్పు కూలిన ఘటనలో 11 మంది మృతి చెందారు. భారీ వర్షాల నడుమ బాలికల వాలీబామ్ టీం జిమ్‌లోపల ఉన్నప్పుడే ప్రమాదం జరిగింది. దీనితో మృతులలో ఎక్కువ మంది చిన్నారులైన క్రీడాకారిణులే ఉన్నట్లు వెల్లడైంది. చైనా ఈశాన్య ప్రాంతంలోని క్వికిహర్ నగరంలో ఈ విషాదం చోటుచేసుకుందని హెయిలోజియాంగ్ ప్రాంత మీడియా సంస్థలు తెలిపాయి. బాలికలు శిక్షణ పొందుతూ ఉన్నప్పుడే ప్రమాదం జరిగిందని తెలియడంతో తల్లిదండ్రులు వారి పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు.

మొత్తం పై కప్పు పూర్తిగా విరిగి కిందపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఈ సమయంలో లోపల 19 మంది వరకూ ఉన్నారు. స్థానిక మున్సిపాల్టీ సిబ్బంది ఇక్కడికి తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ జిమ్ పక్కనే మరో భవనం కడుతున్నారు. నిర్మాణ సిబ్బంది నిర్లక్షంతో ఈ జిమ్‌పై భారీ గాజు పలకను పెట్టడం, భారీ వర్షాలతో దీని భారం పై కప్పుపై పడటంతో కుప్పకూలినట్లు వెల్లడైంది. కాంక్రీటు దిమ్మెలు కిందపడటంతో లోపల ఉన్న వారు నుజ్జునుజ్జయ్యారు. నిర్మాణ సంస్థ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News