బెంగళూరు/జైపూర్ : కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, రాజస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. బెంగళూరు లోని కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద మంగళవారం తెల్లవారు జామున వేగంగా వెళ్తున్న ఆడి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చుని ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏళ్ల లోపు వారే. మృతుల్లో తమిళనాడు డిఎంకె ఎమ్‌ఎల్‌ఎ వై ప్రకాశ్ కొడుకు, కోడలు , కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్కరూ సీటు బెల్టు ధరించలేదని నిర్ధారించారు.
రాజస్థాన్‌లో….
రాజస్థాన్ నాగౌర్‌లో మంగళవారం ఉదయం వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే 11 మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.. ఈ ప్రమాదం బికనీర్ జోథ్‌పూర్ జాతీయ రహదారిపై జరిగింది. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వీరంతా రామ్‌దేవర, కర్నీమాత, ఆలయాల్లో పూజలు చేసి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. శ్రీబాలాజీ ఏరియాలో ఈ ప్రమాదం జరగడంపై విచారం తెలియచేస్తూ మృతుల కుటుంబాలకు రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ మృతుల కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.