Wednesday, January 22, 2025

ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. తాజాగా 11 కేసులు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఓ వైపు కేరళ రాష్ట్రంలో నిఫా కలవరపాటుకు గురి చేస్తుండగా, మరోవైపు ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో కేసుల సంఖ్య 180 కి చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న 59 మంది శాంపిళ్లను పరీక్షించగా, అందులో 11 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని వెల్లడించారు. మొత్తం 180 కేసుల్లో 10 మంది బాధితులు ఒడిశా రాష్ర్టేతరులు కాగా, 9 మంది ఇతర జిల్లాల నుంచి ఉన్నారని సుందర్‌గఢ్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కన్హు చరణ్ నాయక్ తెలిపారు. ఈ జిల్లాలో శనివారం ఏడు కేసులు నమోదయ్యాయి.

ఎవరికైనా నాలుగు లేదా ఐదు రోజులు జ్వరం ఉండే వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కన్హుచరణ్ నాయక్ కోరారు. రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి సుందర్‌గఢ్ జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉచితం గానే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో తగినంతమంది ఆశ కార్యకర్తలు, నర్సులకు శిక్షణ ఇచ్చి వారిని సన్నద్ధం చేశారు. ఒడిశాలో ఇప్పటివరకు స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. దాంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ వ్యాధిని అధ్యయనం చేయడానికి వీర్ సురేంద్రసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (వీఐఎంఎస్‌ఎఆర్) నుంచి ముగ్గురు నిపుణులను బర్గఢ్ జిల్లాకు పంపించింది.

ప్రస్తుతం బర్గఢ్ జిల్లాలో 11 యాక్టివ్ కేసులు ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధి తరచూ పొలాలు, అటవీ ప్రాంతాల్లో పనిచేసే ప్రజలకు సోకుతుంది. ఒకరకమైన లార్వా పురుగులు కుట్టడంతో శరీరంపై ఎస్సర్ అనే మచ్చ పడుతుంది. ఈ కీటకాలు కుట్టిన చోట చర్మకణాలు మృతి చెందుతాయి. వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలకు అపాయం ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News