Saturday, November 23, 2024

విషవాయువులకు 11 మంది బలి

- Advertisement -
- Advertisement -

లూథియానా : పంజాబ్‌లో విషవాయువులు 11 మంది ప్రాణాలను తీశాయి. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. లూథియానా నగరంలో బాగా జనంతో కిక్కిరిసి ఉండే గియాస్‌పురా ప్రాంతంలో ఓ మురికి నీటి నాలాలో కొన్ని విషకరమైన రసాయనాలను పారవేసిన దశలో ఇక్కడి వారిని విషవాయువులు కమ్మేసినట్లు, దీనితో శ్వాస ఆగిపోయి వీరు బలి అయినట్లు వెల్లడైంది. మృతులలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చనిపోయిన వారంతా ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన పేద కూలీలే అని వెల్లడైంది. వాయువులతో సొమ్మసిల్లిన వారికి స్థానిక ఆసుపత్రులలో చికిత్స జరుపుతున్నారు. ఇక్కడ ఎటువంటి వాయువు లీక్ అయిందనేది ఇప్పటివరకూ నిర్థారణ కాలేదని స్థానిక అధికారులు ఆదివారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ప్రాంతానికి వెనువెంటనే జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) హుటాహుటిన తరలివచ్చింది.

ముందుగా ఈ ప్రాంతాన్ని సీల్ చేశారు. స్థానికులను ఇక్కడి నుంచి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలోని మురుగు నీటిలో కెమికల్స్ పారవేయడంతో మ్యాన్‌హోల్స్‌లోని మిథేన్‌తో కలిసి విషవాయువులు ఉత్పత్తి అయి ఉంటాయని, దీనితోనే ఇక్కడి వారిని ఊపిరే కాటేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ గియాస్‌పురా ప్రాంతం ఎక్కువగా పేదలు, అందులోనూ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి రెక్కల కష్టం మీద బతుకులీడుస్తున్న వారే. సమీపంలో మురుగు నాలాలు ఉన్నా, చెత్తాచెదారాలు పారినా వీరు తప్పనిసరిగా ఇక్కడనే బతకాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో పారిశ్రామిక ఫ్యాక్టరీలు, నివాసిత భవనాలు ఉన్నాయి. మృతులలో ఆరుగురు మగవారు, ఐదుగురు ఆడవారు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పాలదుకాణానికి తరలివచ్చిన వీరు విషవాయువులు సోకడంతో పిట్టల మాదిరిగా పడిపోయినట్లు , తమ తోటి వారు ఈ విధంగా దుర్మరణం చెందడంతో ఆదివారం ఈ స్థానికులు విషాదంలో మునిగారు.

జిల్లా అధికార యంత్రాంగం మృతుల కుటుంబాలకు తలా రెండు లక్షల రూపాయల చొప్పున, అస్వస్థతకు గురైన వారికి రూ 50000 వంతున సహాయం ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించారు. ఘటన తీవ్రస్థాయిలో కలచివేసిందని పేర్కొన్న పంజాబ్ ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో రసాయనిక వ్యర్థాలు పారపోసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతంలో చాలా సేపటివరకూ విషవాయువుల వ్యాపిస్తూ ఉండటంతో స్థానికులు దూర ప్రాంతాలకు తరలివెళ్లారు. దీనితో ఆదివారం రాత్రి వరకూ ఇక్కడ నిర్మానుష్యం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News