Monday, January 20, 2025

యుపిలో కాంగ్రెస్‌కు 11 సీట్లు

- Advertisement -
- Advertisement -

లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్ల వ్యవహారం బేరసారాల దశలో చిక్కుల్లో పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్‌కు 11 సీట్ల అవకాశం కల్పిస్తామని , ఇవన్నీ గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలని , ఇప్పటికైతే ఈ 11 సీట్లతో కాంగ్రెస్ సర్దుకోవాలని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ శనివారం తమ సీట్ల సర్దుబాట్ల ఆలోచన ప్రకటించారు. అయితే దీనికి కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదని వెల్లడైంది. ముందుగా అఖిలేష్ శనివారం ఉదయం ఏకంగా కాంగ్రెస్ 11 స్థానాల్లో యుపి నుంచి పోటీకి దిగుతుందని ప్రకటించేశారు.

కాంగ్రెస్‌తో తమ పార్టీ స్నేహపూరిత బంధం ఈ 11 సీట్ల తొలి ఆఫర్‌తో ఆరంభం అవుతోందని, దీనితో కాంగ్రెస్ పార్టీ సంతృప్తి చెందుతుందని తాను భావిస్తున్నట్లు అఖిలేష్ తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్య పెంచే సర్దుబాట్ల ప్రక్రియ ఇక ముందు కూడా ఉంటుందని, గెలుపోటముల సమీకరణలను పరిస్థితులను బట్టి దీనిపై ఆలోచించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కు బలీయ స్థాయి 11 సీట్లు దక్కుతాయి. ఇది వారికి శుభారంభమే అవుతుందన్నారు. ఇండియా టీం, పిడిఎ వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తాయని , చరిత్రను తిరగరాస్తాయని అఖిలేష్ విలేకరులకు తెలిపారు.

డీల్‌కు కాంగ్రెస్ తిరస్కరణ …50 స్థానాలకు పట్టు?
ఉత్తరప్రదేశ్‌లో సీట్ల గురించి అఖిలేష్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇదంతా ఆయన ఇవ్వడం మేము తీసుకోవడం తరహాలో ఉందని, ఇప్పటి సర్దుబాటు ప్రతిపాదన కేవలం అఖిలేష్ యాదవ్‌ది అని, కాంగ్రెస్‌ది కాదని, ఆయన నిర్ణయంతో నిమిత్తం లేనిదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. విపక్ష కూటమి ఇండియాలో కీలక పార్టీల పరస్పర తగవుల తంతు , కాంగ్రెస్ పట్ల పలు పార్టీల అసంతృప్తి చిక్కులకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి, పంజాబ్, ఢిల్లీలో ఆప్ నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకత వ్యక్తం అయింది. సీట్ల పంచాయతీ నెలకొంది. కాగా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి , మిత్రపక్షం అప్నాదళ్ కలిసి 62 సీట్లలో గెలిచాయి. కాగా ఎస్‌పిబిఎస్‌పి కూటమి 15 స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క స్థానం దక్కించుకుంది. ఒక్క సీటు ఉన్న కాంగ్రెస్‌కు తాము ఇప్పుడు 11 స్థానాల పోటీకి అవకాశం ఇస్తున్నామని ఎస్‌పి తెలియచేస్తోంది. కాగా ఈ ఆఫర్‌ను కాంగ్రెస్ కాదనడంతో ఎస్‌పి తరఫున సాయంత్రం ఓ వివరణ వెలువడింది. కాంగ్రెస్‌కు తాము పంపించింది కేవలం ప్రతిపాదన అని, సీట్ల పెంపుదల గురించి తరువాత పరస్పరం ఆలోచించుకోవచ్చునని ప్రకటించింది. కాగా ఉత్తరప్రదేశ్ నుంచి కనీసం 50 స్థానాలలో పోటీకి కాంగ్రెస్ కన్నేసినట్లు, ఇందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News