Friday, December 20, 2024

తల్లి నిద్రపోతోందని.. శవం పక్కనే రెండు రోజులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తల్లి నిద్రపోతోందని భావించి ఆమె మృతదేహం పక్కనే రెండు రోజులు గడిపాడు ఒక 11 ఏళ్ల బాలుడు. ఈ దిగ్భ్రాంతికర ఉదంతం బెంగళూరులోని ఆర్‌టి నగర్‌లో చోటుచేసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. తన తల్లి మరణించిందని ఆ బాలుడికి తెలియదని, ఆమె నిద్రపోతోందని, తనపైన కోపంతో మాట్లాడడం లేదని మాత్రమే ఆ బాలుడు భావించాడని పోలీసులు తెలిపారు. 44 సంవత్సరాల అన్నమ్మ అనే మహిళ ఫిబ్రవరి 26న తన నివాసంలో లో షుగర్, బ్లడ్ ప్రెషర్ కారణంగా మరణించింది. నిద్రలోనే ఆమె మరణించడంతో ఇది తెలియని ఆమె కుమారుడు తన తల్లి రోజంతా నిద్రపోతోందని భావించాడు. ఏడాది క్రితం అన్నమ్మ భర్త కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణంగా మరణించాడు.

ఆ ఇంట్లో తల్లి, కుమారుడు మాత్రమే నివసిస్తున్నారు. తల్లి నిద్రపోతోందని భావించి ఆమె కుమారుడు అప్పుడప్పుడు బయటకు వచ్చి తన మిత్రులతో ఆడుకునేవాడు. స్నేహితుని ఇంట్లోనే తినేవాడు. రెండు రోజులు ఇదే విధంగా కొనసాగింది. అయితే ఫిబ్రవరి 28న తనతో తన తల్లి మాట్లాడని విషయాన్ని తన తండ్రి స్నేహితులకు ఆ బాలుడు తెలియచేశాడు. దీంతో అనుమానం వచ్చి వారంతా ఇంట్లోకి వచ్చి చూసి అన్నమ్మ మరణించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు తెలియచేయగా వారు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News