న్యూఢిల్లీ : దేశంలో 2014 నుంచి ఎంబిబిఎస్ సీట్లో 110 శాతం పెరుగుదల ఉందని, ఇదే విధంగా వైద్యకళాశాలల సంఖ్యలో 82 శాతం హెచ్చంపు ఉందని పార్లమెంట్‌లో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో 2014కు ముందు 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటి సంఖ్య ఇప్పుడు 704కు చేరింది. కాగా ఇంతకు ముందు మెడికల్ కాలేజీలలో సీట్లు 51,348 ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 1,07,948కు చేరింది. ఈ విషయాన్ని లోక్‌సభలో ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయా ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
కాగా మెడికల్ పిజి సీట్లలో 117 శాతం పెరుగుదల ఉంది. ఇందకు ముందు ఇవి 31,185 వరకూ ఉన్నాయి. కాగా ఇప్పుడివి 67,802కు చేరాయి. గత ఐదేళ్లలో 101 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆధ్వర్యపు పథకం (సిఎస్‌ఎస్) పరిధిలో ఆమోదం తెలిపారు. అసోంతో పాటు పలు ప్రాంతాలలో వీటిని ఇప్పుడున్న జిల్లా /రెఫరల్ ఆసుపత్రుల అనుసంధానంగా ఏర్పాటుకు వీలు కల్పించారు. దేశంలో వైద్యకళాశాలల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇందుకు అనుగుణంగానే ఎంబిబిఎస్ సీట్లు కూడా పెరిగాయి.