Monday, December 23, 2024

సివిల్ సప్లయ్స్‌లో రూ.1,100 కోట్ల కుంభకోణం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : పౌరసరఫరాలశాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కా ర్ కుంభకోణానికి తెరలేపిందని, సన్నబియ్యం టెండర్లలో మొత్తం రూ.1,100 కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, 700 నుంచి 750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ధాన్యం విక్రయం కోసం జనవరి 25న కమిటీ వేసి, టెండర్లు పిలిచి మొత్తం ప్రక్రియను ఒకేరోజులో పూర్తి చేయడంలో ఆంత ర్యం ఏమిటని ప్రశ్నించారు.

35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో రూ.700 నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు.. మొత్తంగా రూ.1100 కోట్ల కుంభకోణం చేశారని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రవీందర్ సింగ్, పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రూ.1100 కోట్ల కుంభకోణం వివరాలను వెల్లడించారు. ఈ కుంభకోణం రెండు భాగాలుగా జరిగిందని వివరించారు. ముందుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించి మిల్లర్ల దగ్గర ఉంచిన 35 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపిందని చెప్పారు.

అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపారని అన్నారు. క్వింటాలుకు రూ.2100 కు కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేసి.. గ్లోబల్ టెండర్లు పిలిచారని తెలిపారు. ప్రత్యేక నిబంధలు పెట్టి కేవలం నాలుగు కంపెనీలకే టెండర్లు వచ్చేటట్టు చేశారని పేర్కొన్నారు. కేంద్రీయ బండార్, ఎల్‌జి ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాక్‌హాఫ్ అనే నాలుగు సంస్థలు ఈ టెండర్లను దక్కించుకున్నాయని అన్నారు.

నాలుగు సంస్థలు దాదాపు ఒకే ధరకు టెండర్ వేశాయంటే… ఇది రింగు కాక మరేమిటని రేవంత్ సర్కార్‌ను కెటిఆర్ ప్రశ్నించారు. గ్లోబల్ టెండర్లు పిలిచి మొత్తం 4 సంస్థలకే కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు. కేంద్రీయ భండార్ సంస్థను తమ ప్రభుత్వం బ్లాక్ చేసిందని తెలిపారు. ఇప్పుడు నిబంధనలు మార్చేసి మళ్లీ కేంద్రీయ భండార్ సంస్థకే టెండర్ కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయాన్ని క్వింటాల్‌కు రూ.2007కే ఒప్పందం చేసుకున్నారని వివరించారు.

కుంభకోణంలో సిఎం రేవంత్ పాత్ర

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం సేకరణ వ్యవహారంలో రూ. 300 కోట్ల స్కామ్ చేశారని కెటిఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై 1100 కోట్ల రూపాయల కుంభకోణం చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుమతి లేకుండా ఏమీ జరగదనే విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News