శనివారం మొదలైన అమర్‌నాథ్ యాత్రలో తొలి రోజు ఆదివారం 1100 మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ గుహాలయం లోపల దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు 1100 మందికి పైగా భక్తులు గుహాలయం లోపల దర్శనం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎగువన ఉన్న గుహాలయం దిశగా ఉదయం బల్తాల్, నున్వాన్ (పహల్‌గామ్) బేస్ క్యాంప్‌ల నుంచి యాత్రికుల బృందానికి సంబంధిత జిల్లా అభివృద్ధి కమిషనర్లు,
ఇతర జిల్లా స్థాయి సీనియర్ అధికారులు వీడ్కోలు పలికారు. బల్తాల్, పహల్‌గామ్ నుంచి రెండు గుహాలయం మార్గాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేయడమే కాకుండా అదనంగా వైద్య సహాయం, ఆహార సరఫరాలు, విశ్రాంతి ప్రదేశాలు సమకూర్చారు. యాత్రికులు మరింత సౌఖ్యంగా పవిత్ర యాత్ర చేయడానికి అధిక సంఖ్యలో స్థానికులు వీలు కల్పిస్తున్నారు. గుహాలయంలో పవిత్ర హిమ లింగం ఈ ఏడాది పూర్తిగా రూపుదిద్దుకున్నదని యాత్ర నుంచి తిరిగి వస్తున్న భక్తులు తెలిపారు.