న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫాం ఒకేసారి 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా లేకపోవడం, పెరుగుతున్న వ్యయాలు, బలహీనమైన ప్రకటనల మార్కెట్ కారణంగా తమ వర్క్‌ఫోర్స్‌లో 13 శాతం లేదా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2022లో టెక్ కంపెనీ చేసిన అతిపెద్ద తొలగింపు ఇదే. రానున్న రోజుల్లో కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకాలు కూడా చేపట్టబోదని మెటా తెలిపింది. బుధవారం ఉద్యోగులకు తొలగింపు లేఖలను పంపారు. కంపెనీ తీసుకున్న నిర్ణయానికి నేను బాధ్యత వహిస్తానని మెటా సిఇఒ మార్క్ జుబెర్‌బర్గ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇది అందరికీ కష్టమని నాకు తెలుసు, దీని వల్ల నష్టపోయిన వారికి నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు.
2004 సంవత్సరంలో స్థాపించిన ఫేస్‌బుక్, ఈ 18 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా డిజిటల్ ప్రకటనల ఆదాయంలో గణనీయమైన తగ్గుదలను చూసింది. ఈ కారణంగానే భారీ ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. గత వారం ట్విట్టర్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఈ సంస్థలో ఉద్యోగులను దాదాపు 50 శాతం తగ్గించుకున్నారు. ఉద్యోగులను తొలగించడం తప్ప మరో అవకాశం లేదని, రోజుకు 4 మిలియన్ డాలర్లు నష్టపోతున్నామని మస్క్ చెప్పారు.
జుకర్ బర్గ్ కూడా ఇలాంటి కారణమే వెల్లడించారు. మెటావర్స్‌లో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని, అందుకే కంపెనీ ఇతర రంగాలపై దృష్టిపెట్టిందని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై సంక్షోభం మేఘాలు కమ్ముకుని మాంద్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో టెక్ కంపెనీల పెరుగుతున్న వాల్యుయేషన్ గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెటా స్టాక్ మూడింట రెండు వంతుల శాతం పడిపోయింది. సెప్టెంబరు చివరిలో మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులను హెచ్చరించారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకుని, పునర్నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
400 మంది భారతీయులపై ప్రభావం
ఫేస్‌బుక్ తొలగించిన 11 వేల మందిలో భారతీయ ఉద్యోగులు 300 నుంచి 400 మంది ఉండొచ్చని తెలుస్తోంది. 2022 సెప్టెంబర్ చివరి నాటికి మెటాలో 87,314 మంది ఉద్యోగులు ఉన్నారు. మెటా ప్రస్తుతం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిగి ఉంది. అయితే కంపెనీ మెటావర్స్‌పై తన వ్యయాన్ని పెంచుతోంది. స్వంత అవతార్‌లను సృష్టించగల వర్చువల్ వరల్డ్‌పై కంపెనీ దృష్టిపెట్టింది. తక్కువ స్వీకరణ రేటు, ఖరీదైన ఆర్ అండ్ డి కారణంగా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో ఆర్థిక సంక్షోభాన్ని కొంతవరకు తగ్గించగవచ్చని కంపెనీ భావిస్తోంది.