Wednesday, January 8, 2025

హన్మకొండ లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఆర్‌టిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం హన్మకొండ హయాగ్రీవాచారి మైదానంలో వరంగల్ రీజియన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 50 ఎలక్ట్రికల్ బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ తదితరులతో కలిసి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్‌టిసిని దండగగా మార్చే ప్రయత్నం చేసిందని, కానీ తమ ప్రభుత్వం ఆర్‌టిసిని పండగ వాతావరణంలోకి తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను చేపట్టిందన్నారు. కొత్తగా 3000 మందిని నియామకాల ద్వారా ఆర్‌టిసిలో ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 1000 బస్సులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసిందన్నారు. తొలి దశలో ఎలక్ట్రిక్ బస్సులను జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్‌కు నడిపిస్తుందన్నారు.

హన్మకొండ జిల్లాకు 112 ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కేటాయించిందని, మొదటి విడతలో 50 బస్సులను వరంగల్ రీజియన్‌కు కేటాయించిందన్నారు. సంక్రాంతి పండుగకు మరో 30 బస్సులను ప్రభుత్వం కేటాయించనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఉచిత ఆర్‌టిసి బస్సు ప్రయాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 127 కోట్ల మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించినట్లు చెప్పారు. దీనివల్ల 4,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్‌టిసికి చెల్లించిందన్నారు. జిల్లాలో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ నిమిత్తం చార్జింగ్ స్టేషనులకు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుందని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ..ఆర్‌టిసిని గత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించిందని, తప్పని పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందన్నారు. ఇచ్చిన వాగ్దానాలతో పాటు ప్రజల సంక్షేమం అభివృద్ధి దృష్ట్యా అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యాన్ని కోట్లాది మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ మహానగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్‌టిసి బస్సుల్లో మహిళలు ఉచితంగా వెళ్లి వస్తున్నారని అన్నారు. పుణ్యక్షేత్రాలను కూడా మహిళలు ఉచితంగా దర్శించుకోగలుగు తున్నారని పేర్కొన్నారు. ఆర్‌టిసి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండడంతో గతంలో కంటే దేవాలయాల ఆదాయం మరింత పెరిగిందన్నారు. వరంగల్ ఎంపి డాక్టర్ కడియ ం కావ్య మాట్లాడుతూ.. ఆర్‌టిసిబలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వరంగల్ నగరానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా కేంద్రం నుండి 112 ఎలక్ట్రికల్ బస్సులు నడవనున్నాయని పేర్కొన్నారు. వర్ధన్నపేట ఎంఎల్‌ఎ కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. వర్ధన్నపేట నుండి ఎలక్ట్రికల్ బస్సులను నడపాలని సూచించారు.

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో హనుమకొండ అశోక కూడలి సమీపంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎంఎల్‌ఎ్య రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంఎల్‌ఎసి బస్వరాజ్ సారయ్య, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారద, ఆర్‌టిసి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News