శాంటో డొమింగోలోని ప్రఖ్యాత జెట్ సెట్ క్లబ్ లో కళాకారులు ప్రదర్శన జరుగుతుండగా హఠాత్తు గా పై కప్పు కూలిపోయి, దాదాపు 113 మంది మరణించారు. మరో 225 మందికి పైగా గాయపడ్డారు. కొద్ది నిముషాల వ్యవధిలోనే కాంక్రీట్ స్లాబ్ లతో కూడిన పైకప్పు కూలిపోవడంతో ఎవరూ తప్పించుకునే వీలు చిక్కలేదు. మంగళవారం తెల్లవారు జామున మెరెంగ్యూ గ్రూప్ ఆధ్వర్యంలో నృత్యాలు సాగుతుండగా డాన్స్ ఫ్లోర్ లో చాలామంది కప్పుపడిపోయారు. చాలా మంది వీఐపీలు, నాయకులు, సాంసృ్కతిక కళాకారులు, కళాభిమనులైన జనం ఆనందంగా ఎంజాయ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని
అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగి 24 గంటలు జరిగినా ఇంకా, శిథిలాలకింద ఎవరైనా బతికి ఉన్నారా అని రిస్క్యూ టీమ్ లు నిర్విరామంగా గాలిస్తున్నాయి.
బాధితులలో మెరెంగ్యూ ఐకాన్ రూబీ పెరెజ్ కూడా ఉన్నారు. నృత్యాలు ప్రారంభం కావడానికి కొద్దిగా ముందే పెరెజ్ పాటలు పాడారని ఎమర్జెన్సీ వ్యవహారాల డైరెక్టర్ జువాన్ మాన్యుయెల్ మెండెజ్ తెలిపారు. గాయపడిన వారందరికీ అత్యవసర చికిత్స జరుగుతోంది. ఇంకా ఎవరైనా శిథిలాల కింద ఉన్నారేమోనని,నిర్విరామంగా వెదుకుతున్నామని ఆయన వివరించారు.
క్లబ్ లో కార్యక్రమానికి వచ్చిన తన మిత్రులు, కుటుంబ సభ్యులకోసం వచ్చిన వందలాది మంది క్లబ్ శిథిలాల వద్ద పడిగాపులు పడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. మృతులలో ఇప్పటివరకూ 32 మందినే గుర్తించారు. వారిలో డాక్టర్లు, ప్రముఖ కార్డియాలజిస్ట్, ప్రభుత్వ ఆర్కిటెక్ట్, రిటైర్డ్ పోలీసు అధికారితతో పాటు ఒక మంత్రి సోదరుడు ఉన్నారని మీడియా పేర్కొంది. కాంక్రీట్ పైకప్పు కూలిపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. డొమనికల్ రిపబ్లిక్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.