అత్యధికం బిఎస్‌పి అభ్యర్థులవే
పరిశీలన అనంతరం బరిలో నిలిచింది 2898 మంది
సిఎం పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 114మంది ఢీ
నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ల పరిశీలన ముగిసింది. పెద్ద సంఖ్యలో నామినేషన్ల తిరస్కరణ ముగిశాక బరిలో 2898 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. గజ్వేల్ లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మేడ్చెల్లో 67, కామారెడ్డిలో 58, ఎల్బీనగర్ లో 50, కొడంగల్ లో 15, బాల్కొండలో 9 మంది బరిలో ఉన్నారు. కాగా నారాయణపేటలో అత్యల్పంగా 7 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు.
ఇదిలావుండగా గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంఎల్ఏ తూంకుంట నర్సా రెడ్డి పోటీ చేస్తున్నారు.
నవంబర్ 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అందువల్ల 15 వ తేదీ సాయంత్రం ఎన్నికల బరిలో పోటీ పడనున్న అభ్యర్థుల సంఖ్యపై పూర్తి స్పష్టత రానున్నది. ఇప్పటికే తిరస్కరణకు గురైన నామినేషన్లలో బిఎస్పీకి చెందిన 8 మంది అభ్యర్థులు ఉన్నారు.