Friday, July 5, 2024

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన.. తొక్కిసలాటలో 116 మంది మృతి

- Advertisement -
- Advertisement -

హత్రాస్(యుపి): హత్రాస్ జిల్లాలోని పుల్రాయ్ గ్రామం మంగళవారం ఘోర దుర్ఘటన జరిగింది. ఒక మతపరమైన సత్సంగ్‌లో తొక్కిసలాట జరగడంతో 90 నుంచి వందలాది మంది గాయపడ్డారు. సత్సంగ్ ముగిసిన తర్వాత భక్తులు బయటకు వస్తుండగా తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతులలో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సత్సంగ్ కోసం ప్రజలు భారీ సంఖ్యలో అక్కడ సమావేశమయ్యారని ఆయన చెప్పారు.

సత్సంగ్ జరిగిన ప్రదేశం జనంతో కిక్కిరిపిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు సికందర్ రావు పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆశిష్ కుమార్ తెలిపారు. బంధువులు, ఆప్తుల రోదనల మధ్య బస్సులలో మృతదేహాలను హత్రాస్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. రాష్ట్రపతి ప్రసంగాని ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని నిలిపివేసి హత్రాస్‌లో జరిగిన విషాయ ఘటన గురించి సభ్యులకు తెలియచేశారు. అప్పటి వరకు ప్రతిపక్ష సభ్యులు కేకలు, రభసతో మార్మోగుతున్న సభ మౌనం దాల్చింది.

ఈ ఘటనలో పలువురు మరణించినట్లు తనకు సమాచారం అందిందని ప్రధాని తెలిపారు. మృతి చెందిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. మృతులకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాగా హత్రాస్ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. హత్రాస్ జిల్లాలో జరిగిన విషాద ఘటనలో మహిళలు, పిల్లలతోసహా పలువురు భక్తులు మరనించడం తన హృదయాన్ని కలచివేసిందని ఆమె తెలిపారు.

మృతులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన రాష్ట్రపతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హత్రాస్ జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దిగ్భ్రాంతి ప్రకటించారు. మృతులకు సంతాపాన్ని ప్రకటించిన ఖర్గే క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందచేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం సమకూర్చాలని ఆయన కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సహాయ, రక్షణ చర్యలలో పాల్గొనవలసిందిగా ఇండియా కూటమి కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేశారు. కాగా.. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందచేయాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక ఉన్నతస్థాయి క మిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ కమిటీకి ఆగ్రా అదనపు డిజిపి నేతృత్వం వహిస్తారని ఆయన తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించవలసిందిగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు లక్ష్మీ నారాయణ్ చౌదరి, సందీప్ సింగ్ పుల్రాయ్ గ్రామానికి హుటాహుటిన బయల్దేరి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News