Friday, August 30, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు 117 మంది అథ్లెట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగనున్న విశ్వ క్రీడలు (ఒలింపిక్స్)లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందాన్ని జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం జరుగనుంది. ఈ క్రీడల కోసం 117 మందితో కూడిన క్రీడాకారుల బృందానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కాగా, ఈ జాబితాలో మహిళా షాట్‌పుటర్ అబా కతువా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ర్యాంకింగ్స్ కోటాలో కతువా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకుంది. అయితే ఆమె పేరును అథ్లెట్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారనే దానిపై స్పష్టత రాలేదు.

కాగా, అథ్లెట్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారుల బృందం కూడా పారిస్‌కు బయలుదేరి వెళ్లనుంది. ఇందులో 72 మంది ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67కు మించకూడదు. దీంతో 67 మంది సహాయక సిబ్బంది, మరో ఐదుగురు వైద్య బృందానికి సంబంధించిన ఖర్చులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైంది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో 29 మంది ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిలో 11 మంది మహిళా అథ్లెట్లు ఉండగా 18 మంది పురుష అథ్లెట్లు ఉన్నారు.

షూటింగ్‌లో 21 మందికి చోటు దక్కింది. హాకీ జట్టులో 19 మంది ఉన్నారు. టిటిలో 8, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, ఆర్చరీలో ఆరుగురు, బాక్సింగ్‌లో ఆరుగురు, గోల్ఫ్‌లో నలుగురు, టెన్నిస్‌లో ముగ్గురు, సెయిలింగ్‌లో ఇద్దరు, ఈక్వస్ట్రియన్, జుడో, వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఒక్కొక్కరు చొప్పున బరిలోకి దిగనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఈసారి కూడా పసిడిపై కన్నేశాడు. అతనిపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్‌లో కూడా భారత్ పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉంది.

మరోవైపు భారత బృందానికి చెఫ్ దే మిషన్‌గా స్టార్ షూటర్ గగన్ నారంగ్‌ను ఎంపిక చేశారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, టిటి ఆటగాడు శరత్ కమల్ పతకధారిగా వ్యవహరించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రీడా సంగ్రామంగా పేరున్న ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కళ్లు చెదిరే ఏర్పాట్లు చేసింది. భారత్‌తో సహా అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, కొరియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, రష్యా తదితర దేశాలు ఒలింపిక్స్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News