సీనియర్ నేతల తిరుగుబాటుతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. కొత్త కమిటీలు ప్రకంపనలు సృష్టించడంతో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతల ఆరోపణలతో టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన 12 మంది తమ పిసిసి పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. తమకు పదవులు వద్దని, పదవులు రాని వారికి ఇవ్వాలని ఆ నేతలు సూచించారు. పార్టీ మంచి కోసమే రాజీనామా చేస్తున్నామని వారంతా తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌కి రాజీనామా లేఖలు పంపారు. టిడిపి నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌గా ఉన్న వేం నరేందర్‌రెడ్డి, డి.సీతక్క, పిసిసి వైస్ ప్రెసిడెంట్‌లుగా ఉన్న సిహెచ్. విజయ రామారావు, దొమ్మాటి సాంబయ్య, కరీంనగర్ డిసిపి ప్రెసిడెంట్‌గా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ, పిసిసి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వజ్రేశ్ యాదవ్, పిసిసి జనరల్ సెక్రటరీలుగా ఉన్న సుభాష్‌రెడ్డి, చారగొండ, వెంకటేశ్, పటేల్ రమేశ్‌రెడ్డి, సత్తు మల్లేష్, చిలుక మధుసూదన్‌రెడ్డి, శశికళ యాదవ్‌రెడ్డిలు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలకు రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌లో ఉంటూ ఇతర పార్టీలకు ఎలా సాయం చేస్తున్నారో బయట పెట్టేందుకు కార్యకర్తలకు చెప్పాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ సీనియర్ల వర్గం కుట్ర చేస్తుందని రేవంత్ వర్గం ఆరోపిస్తుంది. అంతకు ముందు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన సీనియర్లు ‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పార్టీలో ముందునుంచి ఉన్న నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే పదవులు ఇవ్వడంపై భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా, మధు యాష్కి తదితరులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి రేవంత్ రెడ్డినే కారణం అని, ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
ఈ నెల 20న ఏలేటి మహేశ్వర రెడ్డి ఇంట్లో మరోసారి సమావేశం కానున్నారు. రేవంత్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎఐసిసి కార్యదర్శులు రాష్ట్రానికి రానున్నారు. ఇక ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కెసి వేణుగోపాల్ నుంచి నివేదిక కోరినట్టు, రేవంత్ పై తిరుగుబాటు ప్రకటించిన సీనియర్లను ఢిల్లీ రావాలని అధిష్ఠానం ఆదేశించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.