Sunday, January 19, 2025

మహిళ కడుపులో నుంచి 12 కిలోల కణతి తొలగింపు..

- Advertisement -
- Advertisement -

అనారోగ్య మహిళ కడుపులో నుంచి 12 కిలోల కణతి తొలగించిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహిత ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. ఆసుపత్రి వైద్యురాలు యశోదబాయి తెలిపిన వివరాల మేరకు వంగూరు మండలంలోని పొల్కంపల్లి గ్రామ నిరుపేద దళిత కుటుంబానికి చెందిన పెంటమ్మ అనే మహిళ గత వారం రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ సోమవారం మహిత ఆసుపత్రికి రావడం జరిగింది.

సదరు మహిళకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి కణతి గడ్డతో పాటు మూత్ర పిండాలలో మూడు 8ఎంఎం రాళ్లు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత తమ వైద్య బృందంతో కలిసి ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి కణతి గడ్డను, మూత్ర పిండాలలోని రాళ్లను తొలగించినట్లు యశోదాబాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టతరమైన 12 కిలోల కణతి గడ్డతోపాటు మూత్ర పిండాల రాళ్ల తొలగింపు శస్త్ర చికిత్సను తమ వైద్య బృందం చేయడం అరుదైనదని అన్నారు.

గతంలో తమ ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం ఎన్నో నిర్వహించినట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున నిరుపేద కుటుంబానికి చెందిన మహిళకు అతి తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్స చేయడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం పెంటమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో అనిస్థిషియా వైద్యుడు చంద్రకాంత్, మూత్ర పిండాల వైద్యుడు సుదర్శన్, వైద్యలు రామకృష్ణ, భరత్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యురాలు యశోదబాయికి రుణపడి ఉంటా: బాధితురాలి కుమారుడు బాలస్వామి
గత వారం రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న తన తల్లికి అతి తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్స చేసి కణతి, మూత్ర పిండాలలో రాళ్లను తొలగించిన మహిత ఆసుపత్రి వైద్యురాలు యశోద బాయికి రుణపడి ఉంటానని బాధితురాలి కుమారుడు బాలస్వామి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News