Wednesday, January 22, 2025

బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. బాంబుదాడులు, బులెట్ల వర్షంతో రక్తపుటేరులు పారాయి. ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఎనిమిది మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, బిజెపి, సిపిఎం, కాంగ్రెస్, ఐఎస్‌ఎఫ్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని అధికారులు తెలిపారు.ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బిహార్ జిల్లాలతో పాటుగా క్షిణ 24 పరగణాలు, భంగార్, తూర్పు మిడ్నపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఆయా పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణలను నిలువరించడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.అల్లరి మూకలు, ఆందోళనకారులపై చర్యలు తీసుకొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడడానికి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ బాక్స్‌లను ఎత్తుకెళ్లడం, ధ్వంసం చేయడం, ఓటర్లను భయపెట్టడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. హింసకు ప్రత్యర్థులే కారణమని దాదాపుగా అన్ని పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ‘ నిన్న రాత్రినుంచి దిగ్భ్రాంతికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బిజెపి, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కయి హింసకు పాల్పడుతున్నాయి’ అని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ మంత్రి శశి పంజా ఆరోపించారు.

మరో వైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బిజెపికి చెందిన సువేందు అధికారి డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో హింసపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివసిస్తున్న కాళీఘాట్‌కు నిరసన ర్యాలీ చేపడతామని కూడా ఆయన హెచ్చరించారు. ‘తృణమూల్ పాలనలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు ఎండమావిగా మారాయి. రాజ్యాంగంలోని 355 అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించినప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది’ అని సువేందు అన్నారు. అయితే హింస వెనుక తమ పార్టీ ఉందన్న ఆరోపణలను అధికార తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొట్టింది.‘ అదే నిజమైతే మా పార్టీ కార్యకర్తలపై ఎందుకు దాడులు జరుగుతాయి, హత్యకు గురవుతారు? ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఓటమిని అంగీకరించేశాయి. ఇప్పుడు హింస ఎన్నికలను ఎలా ప్రభావితం చేశాయో చెప్పడానికి కథలు అల్లుతున్నాయి’ అని ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండగా కేవలం 60 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే హింస చోటు చేసుకోవడం, పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగడం జరిగిందని కూడా ఆ పార్టీ పేర్కొంది. రాష్ట్రగవర్నర్ సివి ఆనంద బోస్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి హింసలో గాయపడిన వారిని కలిసి మాట్లాడారు. ఇవి చెదురుమదురు ఘటనలే అయినప్పటికీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరగడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికలు బ్యాలెట్‌తో జరగాలి తప్ప బులెట్లతో కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో అల్లర్లకు కేంద్రమైన ముర్షీదాబాద్ జిల్లాలో టిఎంసి కార్యకర్త బాబర్ అలీని దుండగులు హత్య చేశారు.అదే జిల్లాలోని రేజినగర్‌లో టిఎంసికి చెందిన మరో కార్యకర్త బాంబుదాడిలో మృతి చెందగా,

ఖార్‌గ్రామ్ ప్రాంతంలో మరో కార్యకర్త మృతి చెందాడు. కూచ్‌బిహార్ జిల్లాలో బిజెపికి చెందిన మాధవ్ బిశ్వాస్ అనే కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. తూర్పు బర్దమాన్ జిల్లాలో సిపిఎంకు చెందిన మరో కార్యకర్త రజిబుల్ హోక్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. రాష్ట్రంలో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితులకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలు తమ బలాలను అంచనా వేసుకోవడానికి ఒక అవకాశంగా మారనుండడంతో వీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News