Monday, December 23, 2024

చేతిలో చీలిక

- Advertisement -
- Advertisement -

సీనియర్ నేతల తిరుగుబాటు ఎఫెక్ట్…
కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం
రెండుగా చీలిన కాంగ్రెస్
పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి
‘సేవ్ కాంగ్రెస్’ ఉద్యమ బాట పట్టిన సీనియర్ నేతల డుమ్మా
సీనియర్ల నిర్ణయాన్ని కాదని సమావేశానికి హాజరైన జానారెడ్డి
టిడిపి నుంచి వచ్చిన 12 మంది రాజీనామా
అసంతృప్త నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ వర్గం సన్నద్ధం
రాష్ట్రానికి రానున్న ఎఐసిసి కార్యదర్శులు
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ప్రియాంక ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్ : సీనియర్ నేతల తిరుగుబాటుతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. కొత్త కమిటీలు ప్రకంపనలు సృష్టించడంతో కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతల ఆరోపణలతో టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన 12 మంది తమ పిసిసి పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. తమకు పదవులు వద్దని, పదవులు రాని వారికి ఇవ్వాలని ఆ నేతలు సూచించారు. పార్టీ మంచి కోసమే రాజీనామా చేస్తున్నామని వారంతా తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌కి రాజీనామా లేఖలు పంపారు. టిడిపి నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు.

రాజీనామా చేసిన వారిలో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌గా ఉన్న వేం నరేందర్‌రెడ్డి, డి.సీతక్క, పిసిసి వైస్ ప్రెసిడెంట్‌లుగా ఉన్న సిహెచ్. విజయ రామారావు, దొమ్మాటి సాంబయ్య, కరీంనగర్ డిసిపి ప్రెసిడెంట్‌గా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ, పిసిసి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వజ్రేశ్ యాదవ్, పిసిసి జనరల్ సెక్రటరీలుగా ఉన్న సుభాష్‌రెడ్డి, చారగొండ, వెంకటేశ్, పటేల్ రమేశ్‌రెడ్డి, సత్తు మల్లేష్, చిలుక మధుసూదన్‌రెడ్డి, శశికళ యాదవ్‌రెడ్డిలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలకు రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

కాంగ్రెస్‌లో ఉంటూ ఇతర పార్టీలకు ఎలా సాయం చేస్తున్నారో బయట పెట్టేందుకు కార్యకర్తలకు చెప్పాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ సీనియర్ల వర్గం కుట్ర చేస్తుందని రేవంత్ వర్గం ఆరోపిస్తుంది. అంతకు ముందు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన సీనియర్లు ‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పార్టీలో ముందునుంచి ఉన్న నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే పదవులు ఇవ్వడంపై భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా, మధు యాష్కి తదితరులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి రేవంత్ రెడ్డినే కారణం అని, ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఏలేటి మహేశ్వర రెడ్డి ఇంట్లో మరోసారి సమావేశం కానున్నారు. రేవంత్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.

ఈ వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎఐసిసి కార్యదర్శులు రాష్ట్రానికి రానున్నారు. ఇక ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కెసి వేణుగోపాల్ నుంచి నివేదిక కోరినట్టు, రేవంత్ పై తిరుగుబాటు ప్రకటించిన సీనియర్లను ఢిల్లీ రావాలని అధిష్ఠానం ఆదేశించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

ముందు నుంచీ అసంతృప్తి
టిడిపి నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంది. ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని, టిడిపి నుంచి వలస వచ్చిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై సీనియర్ నేతలు ముందు నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. అధిష్ఠానం నిర్ణయంపై గౌరవంతో ఇన్నాళ్లు ఆ నేతలు అసంతృప్తిని దిగమింగుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి వంటి నేతలు పార్టీని వీడారు. తాజాగా కమిటీల కూర్పు విషయంలో ఈ అసంతృప్తి మరింత పెరిగి కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగా రేవంత్‌పై విమర్శలకు దిగారు. పార్టీ సీనియర్ల సహకారం లేకుండా రేవంత్‌రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికంగా మారింది.

కీలక సమావేశానికి దూరంగా అసంతృప్తి నేతలు
గాంధీభవన్‌లో పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎఐసిసి సెక్రటరీ నదీమ్ జావెద్, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, నాగం జనార్థన్‌రెడ్డి, బలరాం నాయక్, వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ పాదయాత్ర అనంతరం చేపట్టే ’హాత్ మే హాత్ జోడో’ కార్యక్రమాలపై చర్చించారు. జనవరి 26 నుంచి రాహుల్ పాదయాత్ర లక్ష్యాలను జనాల్లోకి తీసుకువెళ్లేలా ‘హాత్ మే హాత్‘ కార్యక్రమాలు చేపట్టాలని ఎఐసిసి నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అసంతృప్తి నేతలు నిర్ణయం తీసుకున్నారు. పిసిసి కమిటీల కూర్పుపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు.

పదవుల కోసం రాలేదు.. కాంగ్రెస్ కష్టంలో వున్నప్పుడే పార్టీలో చేరా: సీనియర్లపై సీతక్క ఆగ్రహం
పదవీ వున్నా లేకున్నా తాము పనిచేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. పిసిసి పదవులకు రాజీనామా చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రానోళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలని, రాహుల్ గాంధీ కూడా ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి సంక్షోభాలు తీసుకురావడం కరెక్ట్ కాదని ఆమె హితవు పలికారు. తమ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే తామే జరగనివ్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం బాగుందని రాహుల్ కూడా చెప్పారని ఆమె తెలిపారు. తాను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తను కాదని అందువల్ల తాను సీనియర్ల మీద బహిరంగ విమర్శలు చేయదలచుకోవడం లేదన్నారు. మా పదవులే వాళ్లకు ఇబ్బంది అయినప్పుడు తమకు అసలు పదవులే వద్దని తేల్చిచెప్పారు. నిఖార్సయిన కాంగ్రెస్ వాదులంతా పార్టీ అధికారంలో వున్నప్పుడు పదవులు అనుభవించి పక్కకు వెళ్లిపోయారని కానీ తాము కాంగ్రెస్‌లోకి వచ్చాక పార్టీ ప్రతిపక్షంలో వుందన్నారు.

ఎవరి లాభం కోసం చేస్తున్నారు: కాంగ్రెస్ సీనియర్లపై మల్ రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం
తప్పు ఎవరూ చేసినా తప్పేనని మాజీ ఎంఎల్‌ఎ మల్ రెడ్డి రంగారెడ్డి చెప్పారు .పిసిసి కమిటీల్లో న్యాయం జరగకపోతే పార్టీ అధిష్టానం ముందు ఈ విషయమై చర్చించాలని ఆయన కోరారు. కానీ కమిటీల విషయమై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే పార్టీకి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పిసిసి కమిటీల్లో తప్పులు జరిగితే పార్టీ అధిష్టానంపై చర్చించాలన్నారు. ఎవరిపై కోపంతో పార్టీకి నష్టం చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సూచించారు. పిసిసి కమిటీల్లో అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డితో పాటు మీరు అధిష్టానం ముందు కూర్చుని చర్చించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మాటలతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి వచ్చేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ల నేతల తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. బిఆర్‌ఎస్, బిజెపికి లాభం చేకూర్చేలా సీనియర్ల వ్యవహరం ఉందన్నారు. గత ఎన్ని కల్లో టికెట్ కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నారు. గెలిచే సీట్లను ఇతరులకు కేటాయించారని మల్ రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. తన నియోజకవర్గంలో సగం స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నట్టుగా ఆయన చెప్పారు. కానీ సీనియర్లుగా చెప్పుకుంటున్న నేతలు తమ నియోజకవర్గాల్లో ఎన్ని స్థానిక సంస్థలను గెలుచుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీనియర్లు బుద్ది మార్చుకోవాలని ఆయన కోరారు.

ఉత్తమ్ ముసుగువీరుడు, సీనియర్ల కుట్రలతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది: మాజీ ఎమ్మెల్యే అనిల్
తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల వివాదం ముదురుతోంది. సేవ్ కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ సీనియర్లు పోరుబాట పట్టారు. వలస నేతలకు కమిటీల్లో స్థానం కల్పించారని కాంగ్రెస్ సీనియర్లు ఆరోపిస్తున్నారు. అయితే సీనియర్లకు మాజీ ఎంఎల్‌ఎ ఎరవత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని బలహీనపర్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈనెల 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయిస్తే, పాదయాత్రను దెబ్బతీయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు ముసుగులో ఉన్న వారు ఇప్పుడు బయటకు వచ్చారన్నారు. 12 మంది ఎంఎల్‌ఎలు పార్టీని వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తురాలేదని అనిల్ సీనియర్లను ప్రశ్నించారు. అప్పుడు పిసిసిగా ఉన్నవాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.

సీనియర్ల లోపాయికారి ఒప్పందం
ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ సీనియర్లంతా పార్టీ కోసం పనిచేస్తే మునుగోడులో 50 వేల ఓట్ల తేడాగా గెలిచే వాళ్లమన్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీస్ పై పోలీసులు దాడి చేస్తే సీనియర్లు ఎక్కడికి పోయారని నిలదీశారు. కాంగ్రెస్ సీనియర్ల లోపాయికారి ఒప్పందం బిజెపితోనా లేక బిఆర్‌ఎస్‌తోనా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థం కోసం టిడిపి పొత్తు పెట్టుకోలేదా? అంటూ మండిపడ్డారు. ఇవాళ టిడిపి నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారని? ఇది న్యాయమా? అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కకు కమిటీల సమాచారం లేదనడం అవాస్తవమన్నారు. సివి ఆనంద్ చెప్పిన మాటాలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. ఉత్తమ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

ఉత్తమ్ ముసుగు వీరుడు
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడని విమర్శించారు. మునుగోడులో ఎవరెవరు ఎంత లబ్ధి పొందారో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఉత్తమ్ గత ఎన్నికల్లో ఎవరెవరికి ఎంత డబ్బులిచ్చారో తెలుసన్నారు. కాంగ్రెస్ డబ్బులపై లెక్కలు అడుగుతారనే నారాయణరెడ్డిని బిజెపిలోకి పంపారని విమర్శించారు. కౌశిక్‌రెడ్డికి ఉత్తమ్ ఎన్ని కోట్లు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. కౌశిక్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి పంపించి ఎంఎల్‌సి చేయించారని ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టుగా పనిచేసినందుకే టిఆర్‌ఎస్‌లో కౌశిక్‌రెడ్డి ఎంఎల్‌సి పదవి దక్కిందన్నారు. సీనియర్ల కుట్రలతోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ముసుగువీరుల కుట్రలకు సామాన్య కార్యకర్తలు బలికావొద్దన్నారు.

కాంగ్రెస్ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరు
పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ప్రజల్లోకి వెళ్లనీయడం లేదని, సీనియర్లు ఆయనను ఇబ్బంది పెడుతున్నారని అనిల్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌కు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పాదయాత్రను ఎవరూ ఆపలేరన్నారు. రేవంత్ పాదయాత్ర వల్ల సీనియర్లకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన నిలదీశారు. ఇతర పార్టీలకు ఎలా లాభం చేయాలనే సీనియర్లు చూస్తున్నారన్నారు. పాదయాత్రలకు సీనియర్లు వచ్చినా చేసేదేం లేదన్నారు. ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోసం ఉత్తమ్ కుమార్‌రెడ్డి పనిచేశారన్నారు. కాంగ్రెస్‌కు నష్టం చేసిన వెంకట్‌రెడ్డితో ఉత్తమ్ ఎలా అంటకాగుతారని ప్రశ్నించారు. మునుగోడులో వెంకట్‌రెడ్డికి ఉత్తమ్ పనిచేశారా? లేదా? సమాధానం చెప్పాలన్నారు. దిల్లీలో ఉత్తమ్ ఏదో చేస్తారని అందరూ భయపడతారని కానీ ఆయన ఏం చేస్తే తమకేంటన్నారు.

ఇదేమీ కొత్త కాదన్న సీనియర్ నేత జానారెడ్డి
సీనియర్ల నిర్ణయాన్ని కాదని పిసిసి విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన జానారెడ్డి పార్టీలో జరుగుతున్న సంక్షోభంపై స్పందించలేదు. పార్టీకి సంబంధించిన ఏ విషయాన్ని తాను బయట మాట్లాడనని, ఏం ఉన్నా అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. పిసిసి కమిటీల విషయంలో గతంలో ఎన్నో గొడవలు జరిగాయని, ఇదేమీ కొత్త కాదన్నారు. కాగా జానారెడ్డి సీనియర్ల పక్షాన కాకుండా రేవంత్ మీటింగ్‌కు హాజరు కావడం తీవ్ర చర్చకు దారితీసింది.

విహెచ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్పందించారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని అనడం లేదని, కాకపోతే కొన్నాళ్లు పనిచేశాక వారికి పదవులు ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కొత్తగా వచ్చిన వారికి వెంటనే పార్టీలో పదవులు ఇస్తే ముందు నుండి ఉన్నవాళ్లకు అన్యాయం చేసినట్లే అవుతుందని చెప్పారు. అంతేకాకుండా మనుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు.

“యాత్ర” పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే..?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ‘యాత్ర’ పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. “హాత్ సే హాత్ జోడ్ అభియాన్‌” పేరుతో ఆయన యాత్ర నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఈ యాత్రు చేపట్టాలని ఎఐసిసి ఇప్పటికే ఆదేశించింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు వ్యవహరిస్తున్నారు. సునీల్ సూచనలు, సలహల మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహలు రచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కమిటీలు చిచ్చు రేపాయి.

అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదు.. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సీనియర్ నేతలు ఉమ్మడి గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత బిజెపి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పిసిసి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. తాను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు బిజెపిలోకి రండి అంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అవినీతిని బయటకు తీయాలంటే బిజెపితోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా బిఆర్‌ఎస్‌కు వేసినా ఒక్కటేనని విమర్శించారు. ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. మునుగోడు ఎన్నికలప్పుడు ఇచ్చిన చండూరు రెవెన్యూ డివిజన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. మద్యం, డబ్బులు ఇచ్చి మునుగోడులో టీఆర్‌ఎస్ గెలిచిందని విమర్శించారు. మునుగోడు పరిస్థితి చూసి మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News